బాబు”కమ్మ”గా లేరా?

0
292
chandrababu doesn't priority to kamma categories people

Posted [relativedate]

chandrababu doesn't priority to kamma categories people
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా ఆయన కుల ప్రస్తావన తప్పకుండా ముందుకొస్తుంది.ఆయన్ని దెబ్బ కొట్టేందుకు ప్రత్యర్ధులు ప్రయోగించే తొలి అస్త్రం అదే.రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రభావం ఇంకాస్త పెరిగింది.ఎవరు ఔనన్నా కాదన్నా 13 జిల్లాల్లోనూ కులం ఏదో రకమైన పాత్ర పోషిస్తునే వుంది.తాజాగా నరసారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలతో కమ్మ కుల ప్రస్తావన వచ్చింది.సీఎం చంద్రబాబు కమ్మల్ని పట్టించుకోవడంలేదని ఓ కుల సంఘ సమావేశంలో ఆయన అన్నారు.దీని వల్ల కృష్ణ,గుంటూరు జిల్లాల్లోని పార్టీ శ్రేణుల్లో కొంత నిరాసక్తత ఏర్పడుతోందని రాయపాటి వ్యాఖ్యానించారు.పైగా అధికారుల మాటలు విని నేతలకి ప్రాధాన్యం తగ్గిస్తున్నారని కూడా బాబు మీద రాయపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు.రాయపాటి మాటలతో నిజంగా కమ్మల్ని బాబు దూరంగా పెడుతున్నారా అన్న డౌట్ వస్తోందా ? అయితే ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిద్దాం..

ముద్రగడ పద్మనాభం గుర్తున్నారు కదా ..కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత.ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ఏపీ రాజకీయాల్ని ఆ కులం గుప్పిట్లో పెట్టుకుందని అంటుంటారు.ఆ ప్రస్తావన లేకుండా ఆయన మాట్లాడరు.మరీ ఇదే మాటలు నిజమనుకుందామా ?

,rayapati says chandrababu doesn't priority to kamma categories peopleరాయపాటి,ముద్రగడ ఈ ఇద్దరు సీనియర్స్ తమ అనుభవంతో ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసిన వాళ్ళు.ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుని ఈసారి కొడుకుని ఎంపీ లేదాఎమ్మెల్యే చేయాలని రాయపాటి తహతహలాడుతున్నారు.రాయపాటి కొడుకు పరిధి గుంటూరు జిల్లా కాబట్టి అక్కడి రాజకీయాల దృష్టితో ఆయన మాట్లాడుతున్నారు.ఇక ముద్రగడ లక్ష్యం చంద్రబాబుని గద్దె దించి జగన్ ని కుర్చీ మీద కూర్చోబెట్టి ప్రతిగా రాజకీయ పూర్వ వైభవం తెచ్చుకోవడం.తమ తమ ప్రయోజనాల దృష్టితో వారు మాట్లాడుతున్నా సామాన్యులు అది గ్రహించలేక ఆ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం లేకపోలేదు.ఆ సంగతి పక్కనబెడితే నిజంగా చంద్రబాబు కమ్మలతో ఎలా వ్యవహరిస్తున్నారో ఓ సారి చూద్దాం.

1995 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన చంద్రబాబు తనపై కుల ముద్ర లేకుండా చూసుకుందామని అవసరానికి మించి తాపత్రయపడ్డారు.ఆ తొమ్మిదేళ్ల సమయంలో బాబుకి సన్నిహితంగా వున్నది వీరే ..యనమల రామకృష్ణుడు,ఎర్రన్నాయుడు, ఎలిమినేటి మాధవ రెడ్డి,బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి,వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి,కోటగిరి విద్యాధరరావు,దేవేందర్ గౌడ్ లాంటి నేతలు బాబు నిర్ణయాల్ని ప్రభావితం చేసే వాళ్ళు. ఈ కోటరీ లో ఒక్క మండవ వెంకటేశ్వరరావు ఒక్కడే కమ్మ కులానికి చెందినవాడు.ఆ టైం లో బాబుని కమ్మలు పెద్దగా సొంతం చేసుకుంది లేదు.2004 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది.కమ్మ ప్రాబల్యం ఎక్కువనుకునే కృష్ణా,గుంటూరు జిల్లాల్లో టీడీపీ ఘోర పరాభవం ఎదుర్కొంది.ఇక అదే కుల సెటిలర్లు ఎక్కువగా వున్న హైదరాబాద్ లోను అదే పరిస్థితి.ఓ రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ మీద అభిమానం లేదా బాబు వ్యతిరేకత వున్న కమ్మలు 2004 లో కాంగ్రెస్ కోసం దూకుడుగా పనిచేశారు.ఫలితం సాధించారు.వై.ఎస్ అధికారంలోకి వచ్చాక పరిటాల హత్య,మార్గదర్శి మీద దాడి ఎపిసోడ్ తో కమ్మలు ఉక్కపోతకు గురయ్యారు.ఆ టైం లోనే సొంత కులంలోనూ తనపై పెద్దగా సానుభూతి లేదని,దాని వల్ల ఎంత నష్టమో బాబుకి అర్ధమైంది.వై.ఎస్ దూకుడుతో బాబుకి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.2014 ఎన్నికల్లో అధికారం దక్కాక రాజధాని ఎంపిక,నేతలకి ఇస్తున్న ప్రాధాన్యం వంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బాబు వ్యవహారశైలితో మార్పు చూడొచ్చు.రాజకీయ అవసరాల దృష్ట్యా కాపుల్ని దువ్వుతూనే కమ్మలకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకి కూడా పెద్ద పీట వేశారు.ఇదంతా కులాభిమానం అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఇక్కడ కులం కన్నా రాజకీయ అవసరాలకే ప్రాధాన్యత.ఆ వ్యూహాల్లో జనం తో పాటు వారి భావోద్వేగాలు ముఖ్యం కాబట్టి కులాన్ని బాబైనా ఇంకో నేతైనా వాడుకుంటున్నారు.ఈ విషయాన్ని గ్రహించి అప్రమత్తంగా వ్యవహరించాల్సింది ప్రజలే.జనం పరిణితితో ఉంటే కులం గోడలు బద్ధలవుతాయి.రాజకీయాలు కులాల చుట్టూ కాకుండా విధాన నిర్ణయాల పరంగా జరిగే మంచి రోజులు వస్తాయి.ఆ రోజులు కోసం ఎదురు చూడకుండా ఎవరికి వారు తమ వంతు ప్రయత్నం చేస్తే ఆ స్వప్నం త్వరలోనే సాక్షాత్కరిస్తుంది.

Leave a Reply