కొత్త ఛాంబర్ లో బాబు తొలి సంతకం..మాటలు ఏవి?

Posted October 12, 2016

 chandrababu first signature velagapudi new secretariat
అమరావతి కేంద్రంగా తాత్కాలిక సచివాలయంలోని సరికొత్త ఛాంబర్ లోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టారు.తొలి సంతకం మహిళా సాధికారతకు సంబంధించి పెట్టిన బాబు అమరావతి నిర్మాణం సహా ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

రాజధాని ముంపు ప్రాంతంలో ఉందని, భూ కంపాలొస్తాయని ఏవేవో చెబుతున్నారు. వీలైనన్ని సార్లు విమర్శిస్తున్నారు. ఇక్కడే భూకంపాలొస్తాయని ఎక్కడన్నా రాశారా? వరదలు రాని ప్రాంతలేవి? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు నగరాలకు వరదలు రాలేదా? అని అన్నారు. ఏవైనా ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో మనం ఊహించలేం. కచ్చితవగా పలానా ప్రాంతంలోనే వస్తాయనీ చెప్పలేం. కాస్త ముందు చూపుతో పటిష్టంగా చర్యలు చేపట్టడానికి, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కునే విధంగా మాత్రమే పరిస్థితులు కల్పించేందుకు కృషి చేయాలన్నారు.పంటభూముల్లో రాజధాని కడుతున్నానని విమర్శలు చేయడం సరికాదన్నారు. పంట భూములంటే నీరుండే చోటు. అభివృద్ధికి అవకాశముండే స్థలం. అలాంటి చోట కాకుండా నీరు లేని అడవుల్లో కట్టుకోగలమా అని ముఖ్యమంత్రి అన్నారు. మత్స్యకారులుండే ప్రాంతం నుంచి సింగపూర్ గా మారిన గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఆదర్శంగా తీసుకుని..మనం రాజధాని నిర్మాణాన్ని సాగించాలి. ప్రపంచంలోనే గొప్పగా నివసించే ప్రాంతంగా మార్చాలి. చరిత్రలో నిలిచిపోయేలా విజయదశమి నాడు..తేదీలవి గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది కూడా లేకుండా మంచి గుర్తుండిపోయే రోజున సచివాలయం ప్రారంభించామన్నారు. మహిళల సాధికారత కోసం కొత్త కార్యాలయంలో తొలి సంతకం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

నల్లధనంపై ప్రతి ఒక్కరూ పోరాడాలి…
నల్లధనాన్ని అరికట్టాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వెయ్యి రూపాయల నోట్లని పూర్తిగా తొలగించడం కోసం ఒక గడువు పెట్టుకుని కృషి చేయాలన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా అన్నీ ఆన్ లైన్ లావాదేవీలు జరిగే స్థాయికి చేరుకుంటేనే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. సంపాదన కోసం ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నాయకులు విలువలు కోల్పోతే ప్రజలే చైతన్యవంతులై ప్రశ్నించాలన్నారు. దేశంలోని నల్లధనం శాతంలో హైదరాబాద్‌లో రూ.13వేల కోట్ల నల్లధనం బయటపడింది. అంటే ఇది దేశ అవినీతిలో 20 శాతమని ఆయన అన్నారు. ఒకే వ్యక్తి దగ్గర రూ.10 వేల కోట్లు ఉన్నాయి. ఒక పారిశ్రామిక వేత్తకో ..మరొకరికో ఈ స్థాయి సంపాదన సాధ్యమయ్యే పని కాదని.. నల్లధనం సంపాదించే వారికి రాజకీయాలు అడ్డాగా మారాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం చాంబర్ ప్రారంభోత్సవానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చిన రాజప్ప, మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, చీఫ్ సెక్రటరీ టక్కర్‌, డీజీపీ సాంబశివరావు, పలువురు ఉన్నతాధికారులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజధాని ప్రాంత రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

velagapudi-secretariat-2velagapudi-secretariat-1velagapudi-secretariat-4

 velagapudi-secretariat-3

SHARE