కొడుకు మీద బాబు బరువేస్తున్నాడా?

Posted February 3, 2017

chandrababu giving to municipal ministry to nara lokesh
క్యాబినెట్ లోకి లోకేష్ ని తీసుకోవడం ఖాయమేనని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పగానే ఓ కొత్త చర్చ మొదలైంది.లోకేష్ కి ఏ శాఖ ఇస్తారన్నది ఆ చర్చల సారాంశం.ఇప్పటిదాకా లోకేష్ గురువు చూస్తున్న మునిసిపల్ శాఖనే ఆయనకి కేటాయించవచ్చని బలమైన వాదన వినిపిస్తోంది.ఇందుకు వాళ్ళు చెబుతున్న కారణం ..కేంద్రం నుంచి కాస్త సానుకూలంగా నిధులు వస్తున్నది ఆ శాఖకేనని ,అందుకే అభివృద్ధి చూపించడం సులభమవుతుందని . అయితే ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలు లోకేష్ కి పెద్ద పరీక్షే అవుతాయి.

పదవీబాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే లోకేష్ జర్నీ కష్టం అవుతుందని రాజకీయాన్ని కాచి వడపోసిన చంద్రబాబుకి తెలియదా ? తెలిసినా ..ఆయన ఆ బరువు లోకేష్ నెత్తికి ఎత్తడానికి సిద్ధపడ్డట్టే కనిపిస్తోంది.అందుకు కారణాలు లేకపోలేదు …సమకాలీన రాజకీయాల్లో రాజకీయ సవాళ్ళకి దూరంగా కొడుకుల్ని పెంచి వారికి ఒక్కసారిగా అధికార పగ్గాలు అప్పగిద్దామనుకున్న అతిరథమహారధులంతా బోల్తా పడ్డారు. దీనికి ప్రధమ ఉదాహరణ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ.ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్ళు బాధ్యతల స్వీకరణకు వెనకడుగు వేశారు.కేవలం పెత్తనానికి పరిమితమయ్యారు.వైఫల్యాలు పక్కనబెడితే సొంత పార్టీ నేతల్లోనూ ఆయన విశ్వాసం కల్పించలేకపోయారు.

అటు దేశ రాజకీయాలకి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ రాజకీయ దూకుడుకి రాజకీయ దిగ్గజం,సొంత తండ్రి ములాయం కూడా గుక్కతిప్పుకోలేకపోయాడు.ఇక ప్రధాని మోడీ సునాయాసంగా గెలుస్తానని అనుకున్న యూపీలో ఇప్పుడు అఖిలేష్ డీ అంటే డీ అనే పరిస్థితి తీసుకొచ్చాడు.ఇది ఎలా సాధ్యమైంది అని చూస్తే సమాజ్ వాది అధికారానికి దూరంగా వున్నప్పుడే పార్టీ గెలుపు భారాన్ని అఖిలేష్ నెత్తికెత్తుకున్నాడు .సుదీర్ఘ పాదయాత్రతో మళ్లీ పార్టీకి జవజీవాలు తెప్పించారు.ఆ ప్రయాణంలోనే అఖిలేష్ రాజకీయంగా రాటుదేలారు.ఆ విషయాన్ని ములాయం గుర్తించలేదేమోగానీ బాబు గుర్తించారు.అందుకే కొడుకు లోకేష్ కి బరువెత్తడానికే బాబు డిసైడ్ అయ్యారు.

SHARE