తేనెతుట్టె కదిపిన చంద్రులు ..

 chandrababu kcr speech category reservation

ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు కులాల రిజర్వేషన్లపై చేసిన ప్రకటనలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఏపిలో ఉన్న నిరుపేద అగ్రకులాల వారికి రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్ధిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం వేడుకల్లో ప్రకటించారు. తెలంగాణలో ఎస్టీ, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేస్తామని ఆ రాష్ట్ర సిఎం కెసిఆర్ ప్రకటించారు.  

ఇప్పటికే బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసిన బాబు ఆ రెండు వర్గాలవారి పెదవులపై చిరునవ్వులు పూయించారు. అగ్రవర్ణ పేదలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని చాలాకాలంనుంచీ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవంలో కూడా మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావించడంతో అగ్రకులాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మైనారిటీ, ఎస్టీ వర్గాలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గోల్కొండ సాక్షిగా ప్రకటించారు. దానితోపాటు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ఆయా వర్గాలను ఆనందపరిచింది.

ముఖ్యంగా బోయ, వడ్డెర వంటి కులాలను ఎస్టీల్లో చేర్పించే అంశంపై కేసీఆర్ ప్రకటన ఆ రెండు వర్గాలను మెప్పించింది. నిజానికి కేసీఆర్ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. తాజాగా అదే అంశం ప్రస్తావించి ఆ వర్గంలో ఆశలు చిగురింపచేశారు. అయితే, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులిద్దరూ స్వాతంత్య్ర దినోత్సవ వేదికగా కులాలపై దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కేసీఆర్-బాబు ప్రకటనలు కార్యరూపం దాల్చితే అంతకుమించిన ప్రయోజనం మరొకటి ఉండదు.

కానీ అలాంటి సానుకూల పరిస్థితి దేశంలో ఉందా? అన్న సందేహాలు తెరపైకొస్తున్నాయి. గతంలో వివిధ రాష్ట్రాలు ఇలాంటి అంశాలనే ప్రాతిపదికతో తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానాల్లో చెల్లుబాటు కాని విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అసలు అగ్రకులాలకు ప్రకటించిన రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలోనూ అమలుకాని వైనాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.హర్యానాలో తొలిసారి జాట్లకు రిజర్వేషన్లు ప్రకటించారు. దానిని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపిలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ తీసుకున్న నిర్ణయం కూడా కోర్టులో నిలబడలేదు. దాన్ని కూడా కోర్టులు కొట్టేశాయి. మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అలాంటిదే మరో ప్రయత్నంలో ఉంది. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరతామని బాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికోసం మంజునాధ కమిషన్ కూడా ఏర్పాటుచేసింది.తాజాగా గుజరాత్‌లో పటేళ్లు రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో భారీ ఉద్యమం నిర్వహించారు.

ఫలితంగా గుజరాత్ ప్రభుత్వం ఈ ఏడాది మేలో అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. దానిని కూడా హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ, అది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దాన్ని డిస్మిస్ చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో దానిపై దృష్టి సారించడం లేదు.

వాస్తవాలు ఇలాఉండగా, మళ్లీ కొత్తగా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికపై ఇస్తారన్న ప్రశ్న రాజకీయ, సామాజికవర్గాల నుంచి వినిపిస్తోంది. కుల గణన పూర్తయిన తర్వాత రిజర్వేషన్లు పెంచుకుని, దానికి రాజ్యాంగబద్ధత కల్పించుకోవచ్చు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే పద్ధతిలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ఏపి-తెలంగాణ ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు కేవలం ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రకటనలుగానే కనిపిస్తున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

SHARE