సోమిరెడ్డి వైపు బాబు మొగ్గు?

Posted March 31, 2017

chandrababu may giving minister post to somireddy chandramohan reddy
సింహ‌పురి రాజ‌కీయం మ‌రోసారి వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, బీద ర‌విచంద్ర ఎవ‌రికి వారు మంత్రిప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. అయితే ఇద్ద‌రిలో వ‌చ్చేది ఒక్క‌రికే. ఆ అదృష్ట‌వంతులు ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ముహూర్తం ఖ‌రారైపోయింది. ఏప్రిల్ 2 ఉద‌యం 9 గంట‌ల 25 నిమిషాల‌కు కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని చెబుతున్నారు. ఇక చంద్ర‌బాబు గ‌వ‌ర్నర్ ను క‌ల‌వ‌డం కూడా అయిపోయింది. కాబ‌ట్టి కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఎవరెవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న‌ది ఇప్ప‌టికే చంద్ర‌బాబు నిర్ణ‌యించేశారు. ఆలిస్టులో నెల్లూరు నుంచి ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నెల్లూరు జిల్లాలో బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గానికి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రాజ‌కీయాల్లో 3 ద‌శాబ్దాల అనుభ‌వం ఉంది. గ‌తంలో కేబినెట్ మంత్రిగా ప‌నిచేశారు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఆయ‌న‌కు కేబినెట్ పోస్టు ద‌క్క‌డం పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చు. పైగా ఆయ‌న‌కు చంద్ర‌బాబుతో పాటు లోకేశ్ తోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా జ‌గ‌న్ కు కౌంట‌ర్ ఇవ్వ‌డంలో ఆయ‌న ముందుంటారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతున్నాయి.

మ‌రోవైపు ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర కూడా తానూ రేసులో ఉన్నాన‌ని చెబుతున్నారు. బీసీ వ‌ర్గానికి చెందిన ఆయ‌న చాలాకాలంగా పార్టీలో ఉన్నారు. చంద్ర‌బాబు త‌న‌కు న్యాయం చేస్తాన‌ని ఆశిస్తున్నారు. బీద ర‌విచంద్ర‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని మంత్రి నారాయ‌ణ కూడా రెకమండ్ చేసిన‌ట్టు టాక్. సోమిరెడ్డికి మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి.. ర‌విచంద్ర‌కు కేబినెట్ పోస్ట్ ఇవ్వాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. అయితే మంచి వాగ్ధాటి ఉన్న సోమిరెడ్డిని చంద్ర‌బాబు వ‌దులుకునే అవ‌కాశం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు. అసలే నారాయ‌ణ టైం బాగాలేదు. ఆయ‌న మాట చంద్ర‌బాబు వింటారా? అన్న‌ది అనుమాన‌మే.

చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకున్నా… అన్నీ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. కాబ‌ట్టి పార్టీ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల దృష్ట్యా సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వైపు బాబుగారు మొగ్గు చూప‌వ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి బాబుగారు ఎవ‌రికి లక్కీ ఛాన్స్ ఇచ్చారో… మ‌రికొన్ని గంట‌ల్లోనే తేలిపోనుంది.

SHARE