చిన్నబుచ్చుకున్న అచ్చెన్న…

Posted September 30, 2016

 chandrababu naidu scold acche naidu collectors conference

అసెంబ్లీ అధికార పక్షం పూర్తి ఇబ్బందిలో పడినప్పుడు హఠాత్తుగా అచ్చెన్నాయుడు లేస్తుంటారు. ప్రతిపక్షంపై ఘాటుగా వ్యక్తిగత విమర్శలు చేసి టాపిక్‌ ను డైవర్ట్ చేసేస్తుంటారు. చంద్రబాబుపై ఈగ వాలినా వదిలేది లేదన్నట్టుగా అచ్చెన్నాయుడు తీరు ఉంటుంది. అచ్చెన్నాయుడు అంత గట్టిగా నిలబడుతున్నా చంద్రబాబు నుంచి ఆయనకు తిట్లు మాత్రం తప్పడం లేదు. కేబినేట్‌ భేటీలో ఇప్పటికే అనేకసార్లు సీఎం నుంచి చీవాట్లు పెట్టించుకున్న చరిత్ర అచ్చెన్నాయుడికి ఉంది. తాజాగా మరోసారి అచ్చెన్నకు అంక్షింతలు పడ్డాయి.

ఇటీవల వివిధ అంశాల ఆధారంగా జిల్లాలకు చంద్రబాబు రేటింగ్ ప్రకటించారు. అందులో శ్రీకాకుళం చిట్టచివరి స్థానంలో ఉంది. ఇందుకు అచ్చెన్నాయుడుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రజా శక్తి పత్రిక వెల్లడించింది. సముద్రతీరం, కావాల్సినని వనరులు ఉన్నా శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెనుకబడి ఉందంటూ అచ్చెన్నపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతగా, మంత్రిగా రెండున్నరేళ్లలో ఏం చేశావంటూ అచ్చెన్నాయుడుపై బాబు మండిపడ్డారు. అది కూడా కలెక్టర్ల సమావేశంలో అందరి ముందే చంద్రబాబు ఇలా చివాట్లు పెట్టడంతో అచ్చెన్నాయుడు చిన్నబుచ్చుకున్నారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే పాలకుల నిర్లక్ష్యం కారణంగా శ్రీకాకుళం జిల్లా చాలా దశాబ్దాలుగా వెనుకబడే ఉంది. ఆ వెనుకుబాటు తనాన్ని తరిమేయాలనే విభజన చట్టంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. రెండు దపాలుగా ఇప్పటికే ఇచ్చింది. కానీ ఈ నిధులను వెనుకబడిన జిల్లాలకు వాడకుండా వేరే పనులకు మళ్లించింది చంద్రబాబే. దీనిపై కేంద్రం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా ఒకవైపు వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించాల్సిన నిధులను దారి మళ్లిస్తూ… తిరిగి శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెనుకబడింది అనడం సబబేనా? అని తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట అచ్చెన్న.

SHARE