Posted [relativedate]
ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. కుదిరితే ఏప్రిల్ 2న లేదా ఏప్రిల్ 6న కేబినెట్ లో మార్పులు-చేర్పులు జరగనున్నాయని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు తుది కసరత్తులు చేస్తున్నారట.
చంద్రబాబు కేబినెట్ లో మొత్తం ఆరుగురికి ఛాన్స్ ఇవ్వబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అందులో రెండు పదవులు ఇప్పటికే కన్ ఫాం అయిపోయాయని సమాచారం. లోకేశ్, భూమా అఖిలప్రియకు పదవి ఖరారైపోయిందని తెలుస్తోంది. ఇక మిగిలిన నాలుగింటిలో ఒకటి మైనార్టీలకు ఇస్తారని చెబుతున్నారు. షరీఫ్, జలీల్ ఖాన్, చాంద్ బాషాలో ఒకరికి మినిస్ట్రీ ఇవ్వొచ్చని టాక్. ఇక ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ కు కూడా మంత్రిపదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరిని.. కేబినెట్ లోకి తీసుకోవడం లాంఛమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొత్తగా వచ్చేది ఆరుగురే అయినప్పటికీ… ఇప్పుడున్న మంత్రివర్గంలో ఇద్దరు లేదా ముగ్గురిని పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. రావెల కిశోర్ బాబు, మృణాళిని, కొల్లు రవీంద్రతో పాటు మరికొందరు డేంజర్ జోన్ లో ఉన్నారట. ఈ లిస్టులో కొందరిని తప్పించి… జ్యోతుల నెహ్రూ, సుజయ్ కృష్ణ రంగారావు లాంటి వారికి అవకాశం ఇవ్వబోతున్నారన్న వాదన వినిపిస్తోంది.
మొత్తంగా కేబినెట్ లో భారీగా మార్పులు- చేర్పులు జరగబోతున్నాయని సమాచారం. జిల్లాలు, సామాజిక వర్గాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కేబినెట్ విస్తరణ జరగనుందని చెబుతున్నారు. ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా చంద్రబాబు మార్క్ కనిపించేలా ఈ పునర్ వ్యవస్థీకరణ జరగనుందని సమాచారం. వచ్చే ఎన్నికలకు స్ట్రాంగ్ ప్రిపరేషన్ లో బాబు కేబినెట్ ఉండబోతుందని చెబుతున్నారు. దీంతో ఎవరికి చెక్ పడుతుందో? ఎవరికి లక్కీ ఛాన్స్ దక్కుతుందోనని తెగ చర్చించుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.