వైసీపీ కాళ్ళ బేరం..బాబుకి భయం?

Posted April 13, 2017

chandrababu tensed about ycp joining hands with modi
ప్రధాని మోడీతో వైసీపీ ఎంపీ,జగన్ అనుంగు సహచరుడు,సన్నిహితుడు విజయసాయి రెడ్డి సమావేశం ఇప్పటిదాకా వున్న ప్రచారానికి బలం చేకూర్చింది.జగన్ పై కేసులు ఎత్తేస్తే చాలు ..బీజేపీ లో విలీనానికి వైసీపీ సిద్ధం అంటూ ఎప్పటినుంచో సాగుతున్న ప్రచారానికి తాజా భేటీ ఇంకో సాక్ష్యంగా నిలిచింది.అయితే ఈ సమావేశం ప్రజాసమస్యలపై మాత్రమే అని వైసీపీ రొటీన్ సమాధానం ఇస్తున్నా ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరూ లేరు.కానీ విషయం మోడీతో ముడిపడి వుంది కనుక బీజేపీ,టీడీపీ నేతలు ఎవరూ ఈ అంశం మీద దూకుడు ప్రకటనలు చేయలేదు.అయినా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు వైసీపీ నే బయటపడింది.ఆ పార్టీకి చెందిన విశాఖ నేత గుడివాడ అమర్నాథ్ ఎవరూ అడక్కుండానే వివరణ ఇచ్చాడు.బీజేపీ లో వైసీపీ విలీనం అనేది వట్టి ఊహాగానమేనని చెప్పారు.కేవలం రాష్ట్ర సమస్యలపై చర్చించడానికే విజయసాయి ప్రధాని మోడీతో భేటీ అయినట్టు వివరించారు.అంతటితో ఆగకుండా విశాఖ రైల్వే జోన్,రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని కూడా అమర్నాధ్ హెచ్చరించారు.

హస్తిన లో కాళ్ళ బేరానికి వెళుతూ ఇక్కడ పోరాటం చేస్తామని వైసీపీ చెప్తున్న మాటల్లో నిజముందంటారా ? నిజం వున్నా లేకపోయినా ఈ భేటీ తో ఏపీ సీఎం చంద్రబాబు కి ఝలక్ తగిలినట్టే వుంది.మొన్నీ మధ్య జగన్ కి అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు జైట్లీ మీద అసహనం వ్యక్తం చేసిన బాబు …సీన్ లోకి మాల్యా,మధు కోడా పేర్లు తెచ్చి వారిని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటారా అని నిలదీశారు .ఆ మాట జైట్లీ విన్నారో లేదో గానీ మోడీ విన్నట్టున్నారు. బాబుకి ఇబ్బంది కలిగిస్తుందని తెలిసి కూడా జగన్ తో కేసుల్లో ఇరుక్కున్న విజయసాయి రెడ్డి తో మాట్లాడారు. మొత్తానికి వైసీపీ కాళ్లబేరం ..బాబులో భయం రేకెత్తిస్తున్నట్టే వుంది.

SHARE