Posted [relativedate]
గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా అమరావతి నిర్మాణానికి ప్రచార సాధనంగా మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నారు.అయితే ఆ ఫలితం వస్తుందో …రాదో తరువాత విషయం కానీ అంతకన్నా ముందే ఈ సినిమాతో చంద్రబాబుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.చారిత్రక కధ కావడంతో పాటు తెలుగు జాతి గౌరవాన్ని నిలిపే చిత్రం అవుతుందన్న భావనతో గౌతమీ పుత్ర శాతకర్ణికి బాబు సర్కార్ వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది.ఆ నిర్ణయమే ఇప్పుడు బాబు మీద విమర్శలకి తావిస్తోంది.
గౌతమీపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చి తాను తీసిన రుద్రమదేవి కి ఇవ్వకపోవడంతో దర్శకనిర్మాత గుణశేఖర్ ఇప్పటికే సీఎం చంద్రబాబుకి ఓ లేఖాస్త్రం సంధించారు. ఆయనకి బాసటగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడారు.గౌతమీ పుత్ర శాతకర్ణికి ఇవ్వడం తప్పు కాకపోయినా అదే వెసులుబాటు రుద్రమదేవికి ఇచ్చి ఉండాల్సిందని చిరు అన్నారు.నిజమే కదా !
ఇక తాజాగా బాబు సర్కార్ నిర్ణయం మీద ఓ న్యాయవాది ఏకంగా హై కోర్ట్ ని ఆశ్రయించారు. నిబంధనలకు వ్యతిరేకంగా గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇచ్చారని లంచ్ మోషన్ దాఖలైంది.దీనిపై రెగ్యులర్ బెంచ్ కి వెళ్లాలని హై కోర్ట్ సూచించింది.నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాత నుంచి డబ్బు వసూలు చేయొచ్చని కోర్ట్ అభిప్రాయపడింది.
గౌతమీపుత్ర శాతకర్ణికి తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది.అయితే ఇంతకుముందు రుద్రమదేవి సినిమాకి కూడా కెసిఆర్ ప్రభుత్వం ఇదే వెసులుబాటు కల్పించడంతో అక్కడ పెద్దగా విమర్శలు రాలేదు.కానీ బాబు సర్కార్ రెండు సినిమాల విషయంలో చెరో రకంగా స్పందించడం … వాటిలో ఒకటి సొంత బావమరిది,వియ్యంకుడు నటించిన సినిమా కావడంతో తీవ్ర విమర్శలు,చిక్కులు తప్పడంలేదు.ఇప్పటికైనా జరిగిన తప్పు సరిదిద్దుకుంటే రుద్రమదేవి కి కూడా పన్ను మినహాయింపు వర్తింప చేస్తే విమర్శలు తగ్గడమే కాదు.భవిష్యత్ లో ఈ తరహా చిత్రాలు తీసేందుకు …తెలుగు జాతి చరిత్రని భావితరాలకు చాటేందుకు మరింత మంది నిర్మాతలు ముందుకొస్తారు.ఇక నిర్ణయం చంద్రబాబు సర్కార్ దే…