కత్తికి రెండు వైపులా పదునుండాలంటున్న చంద్రబాబు

Posted April 7, 2017

chandrabbau about ruling abilitiesమంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పాలనకు రాజకీయ కోణాన్ని జోడించాలనుకుంటున్నారు. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ అజెండా కూడా ముఖ్యమేనని ఏకంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు దగ్గరపడుతున్న సంగతి ప్రస్తావించిన సీఎం.. సమస్యల్ని సున్నితంగా పరిష్కరించాలని, ప్రతి చిన్నదాన్నీ వివాదాస్పదం చేయొద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో మంత్రులు, అధికారులు సమాన బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు.

విభజన కష్టాల నుంచి మనకాళ్లపై మనం నిలబడే స్థాయికి వచ్చామని, ఇప్పుడు ఏపీ, అమరావతి ఓ బ్రాండ్ గా మారిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తల్ని గౌరవించాలని, అవసరమైతే సమావేశాలు వాయిదా వేసుకుని అయినా.. ముందు వారి కార్యక్రమాలు చూడాలన్నారు. హెచ్ సీఎల్ అధినేత శివ నాడార్ పెట్టుబడులు పెట్టడానికి విజయవాడ వస్తే.. తానే దగ్గరుంచి ఫ్లైట్ ఎక్కించానని సీఎం గుర్తుచేశారు. ప్రభువ పనితీరు బాగుండాలంటే.. స్థానిక నేతల్ని కలుపుకు పోవాలని చంద్రబాబు సూచించారు.

పనితీరు బాగుంటే.. ఎన్నికల్లో కులమతాలు పనిచేయవని యూపీ ఎన్నికలు నిరూపించాయని ఏపీ సీఎం వివరించారు. ఎన్నికల్లో గెలవడానికి మంచి పేరున్న నేత అవసరం కంటే.. నిబద్ధత గల క్యాడర్ చాలా అవసరమన్నారు బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాడర్ ను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రులకు హితవు పలికారు. మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, సంబంధిత జిల్లాల్లో యాక్టివ్ గా ఉండాలని, స్థానిక ఎమ్మెల్యేల్ని కలుపుకుని ఎన్నికల కోసం ఇప్పట్నుంచే వ్యూహాలు రూపొందించాలని నిర్దేశించారు.

SHARE