
సమర్పణ: దిల్‌రాజు
నిర్మాణ సంస్థలు: మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: కార్తీ, అదితిరావు హైదరీ, రుక్మిణి విజయ్‌కుమార్, ఆర్.జె.బాలాజీ, ఢిల్లీ గణేష్ తదితరులు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
మాటలు: కిరణ్
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ: ఎస్.రవివర్మన్
నిర్మాతలు: మణిరత్నం, శిరీష్
రచన, దర్శకత్వం: మణిరత్నం
చెలియా ….సినిమా రివ్యూ రాయాలంటే ముందుగా ప్రేమని నిర్వచించగలగాలి…యుద్ధాన్ని విశ్లేషించగలగాలి…ఈ రెండు పనులు సమగ్రంగా చేయడం కష్టమే కాదు …అసాధ్యం కూడా.కానీ ఆ ప్రయత్నమే చేసాడు తల నెరిసిన ప్రేమికుడు..భావుకుడు..భారతీయ సినీ రంగం గర్వించదగ్గ మాంత్రికుడు.ఇదంతా ఇంకెవరు ? మణిరత్నం …వన్ అండ్ ఓన్లీ మణిరత్నం .ఆ ప్రేమికుడి మనసు నుంచి జాలువారిన కధ చెలియా …
కధ….చెలియా కధ గా చూస్తే ఒకప్పుడు మణిరత్నం తీసిన రోజా అక్కడక్కడా గుర్తొస్తుంది అనుకోవచ్చు.కానీ సినిమాలోకి వెళ్లే కొద్దీ సినిమా,అందులో పాత్రలు తప్ప ఇంకేమీ గుర్తుకు రానంతగా అందులో లీనం అయిపోతాం.
వరుణ్ (కార్తీ ) యుద్ధ విమానపు పైలట్.యుద్ధఖైదీగా జైల్లో వుంటూ ఓ స్థానిక డాక్టర్ తో తన ప్రేమ కధని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు.ఆ జ్ఞాపకాల్లో ఇద్దరు యువతీయువకులు ..అందులోను బలమైన వ్యక్తిత్వం కలవాళ్ళు ప్రేమలో పడితే ఆ వైరుధ్యాలు ఎలా వుంటాయో …ఆ ప్రేమకి ఎంత శక్తీ ఉంటుందో తెలియజెప్పేలా కధ ముందుకు నడుస్తుంది. వరుణ్ మంచివాడే అయినా తన చుట్టూ ఓ ప్రపంచాన్ని అల్లుకుంటాడు.తనని కాపాడిన డాక్టర్ లీలతో పరిచయం ప్రేమగా మారుతుంది .అయితే దూకుడుతో పదేపదే ఆమె మనసు నొప్పిస్తాడు.చిన్న చిన్న గొడవలు పెద్దవై వారి జీవితాల్ని ఎక్కడికి తీసుకెళతాయి? కార్గిల్ వార్ కి వీరి ప్రేమకి సంబంధం ఏంటి ?ఈ ప్రశ్నలకు సమాధానం కోసం చెలియా చూడాల్సిందే ..
హీరో హీరోయిన్లుగా కార్తీ,అదితి రావు హైదరి ఈ కధకి ప్రాణం పోశారు.వాళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ మీద రంగుల కలని తలపించే విజువల్స్ ని సైతం డామినేట్ చేసింది.ఓ ప్రేమకథలో దేశభక్తిని ఇలా ఇమిడ్చి మణి అందులో నటీనటులకు ఓ సవాల్ విసిరితే దానికి ఏ మాత్రం తగ్గకుండా జవాబు ఇచ్చిన నటీనటులతో చెలియా ఇంకో రేంజ్ కి వెళ్ళింది.ఆ రేంజ్ ని పీక్స్ కి తీసుకెళ్లింది ఏ.ఆర్ రెహ్మాన్ సంగీతం.అయితే అక్కడక్కడా సీన్స్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి.మణి స్టైల్ భావుకత ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.కాస్త జోష్,హుషార్ చాలు భావోద్వేగాలు వద్దు అనుకునే వాళ్ళు మాత్రం చెలియా ని కాస్త బరువు ఫీల్ అవుతారు.
ప్లస్ పాయింట్స్ ..
మణి దర్శకత్వం
రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కార్తీ,అదితి నటన
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ ..
అక్కడక్కడా సాగతీత
పాత మణి సినిమాలు గుర్తొచ్చే సందర్భాలు
లాస్ట్ పంచ్ …’చెలియా’ కొందరికి స్వీట్ ..ఇంకొందరికి వెయిట్
తెలుగు బులెట్ రేటింగ్ .. 3 /5