చైనా స్పీడ్ కు అమెరికా బ్రేక్..

0
526

china speed america break

దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు ఎక్కువ కావడంతో అక్కడున్న మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికా రంగంలోకి దిగింది. అక్కడ యుద్ధ నౌకలను మోహరించింది. దాంతో ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయి. హేగ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఆగ్నేయా ఆసియాలో మరింతగా ఉద్రిక్తతలు రాజేసే అవకాశముంది. దక్షిణ చైనా సముద్రం పై పట్టు కోసం చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పును లెక్కచేయని చైనా మరింత రెచ్చిపోతోంది ఎల్రక్టానిక్ పరికరాలను తయారు చేసే చైనా ప్రపంచ దేశాలకు ఎంత అవసరమో ప్రపంచ మార్కెట్లు కూడా చైనాకు అంతే అవసరం. దక్షిణ చైనా సముద్రంపై తన హక్కును కాపాడుకునే ప్రయత్నంలో చైనా ప్రపంచంతోనే తలపడేందుకు సిద్ధమౌతున్నది.

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం చెలరేగిపోతున్న చైనాకు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇటీవల చుక్కెదురైంది. దక్షిణ చైనా సముద్రంపై తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చట్టబద్ధ ఆధారం లేదని ఐక్యరాజ్యసమితికి చెందిన హేగ్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ శాశ్వత వివాద పరిష్కారాల కోర్టు స్పష్టం చేసింది. అయితే హేగ్ తీర్పును అంగీకరించేదిలేదని చైనా ఇప్పటికే స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ, ఓడరేవుల ఏర్పాటు తదితర చర్యలతో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ హేగ్ ట్రిబ్యు నల్‌లో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ చైనాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువరించింది. అంతేగాకుండా దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ చేపట్టడం ద్వారా చైనా, ఫిలిప్పీన్స్ సార్వభౌమాధికార హక్కులను ఉల్లంఘించిందని తేల్చి చెప్పింది. చైనా చర్యలు పగడాల దిబ్బల్లో పర్యావరణానికి పెనుముప్పుగా మారాయని ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది.

దక్షిణ చైనా సముద్రంలో ఎనిమిది ద్వీప సమూహాలు, వందల ద్వీపాలు న్నాయి. వాటిల్లో అనాదిగా జన సంచారం లేదు. ఇరవయ్యో శతాబ్దం వరకు వాటిపై ఎవరూ ఆసక్తి చూపలేదు. సాగరాల్లోని చమురు, చేపల వేట పెద్ద పరిశ్రమగా అవతరించడంతో సముద్ర వనరులపై పెత్తనం చేయాలన్న ఆరాటం పెరిగింది. ఈ నేపథ్యంలోనే 1982లో ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ఒక దేశం తీర్రపాంతం నుంచి 12 నాటికల్ మైళ్ల (22 కిలోమీటర్లు) దూరం వరకు ఆ దేశ ప్రాదేశిక జలాల కిందకు వస్తుంది.

200 నాటికల్ మైళ్ల వరకు ఆ దేశం ప్రత్యేక ఆర్థిక ప్రాంతం కిందకు వస్తుంది. అక్కడి చేపలు, చమురు లాంటి సహజ వనరులన్నీ సదరు దేశానికే చెందుతాయి. ఆ దేశానికి చెందిన దీవుల విషయం లోనూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఇవికాక సము ద్రంలోని కొండలు, దిబ్బలు, ఆటు సమయంలో బయటపడే ఇసుక తిన్నెలు, సముద్రంలో మునిగిపోయిన గట్లు ఇవేవీ పరిసర జలాల్లోని సహజ వనరుల మీద సదరు దేశానికి ఎలాంటి హక్కును కల్పించవు. అంటే, చేతిలో దీవులుంటే వాటి చుట్టూ ఉన్న సముద్రం మీద కూడా పెత్తనం చేయొచ్చు. దాంతో దక్షిణ చెనా సముద్ర దేశాలన్నీ అందుబాటులో ఉన్న దీవులపై హక్కులు ప్రకటించుకోవడం ప్రారంభించాయి.

ఈ సముద్ర ప్రాంతం సహజ వనరుల్లో సుసంపన్నమైనది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారమే ఏడు వందల కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు న్నాయి. తొమ్మిది కోట్ల కోట్ల ఘనపుటడుగుల సహజవాయువు ఉంది. మలేసి యా, వియత్నాం, తెవాన్, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాల తలరాత మార్చేయగలిగి నంత చమురు సంపద వాటి తీరాల్లో ఉంది. అలాంటి ఆ సముద్రంలో 90 శాతం తమదేనని చైనా అంటున్నది. ఇక్కడి ద్వీప సముదాయాలపై ఒకటి కన్నా ఎక్కువ దేశాలు తమ హక్కులు ప్రకటించుకున్నాయి. దాదాపు అన్ని ద్వీప సముదాయాల పైనా చెనా తన హక్కు ప్రకటించుకుంది. ఇక్కడే వివాదం మొదలైంది.

చైనాతో సైనికంగా తేల్చుకోలేనని గ్రహించిన ఫిలిప్పీన్స్ అమెరికా సలహాతో వందేళ్లుగా పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ- శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1982 నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల ఒప్పందం ప్రకారం ఫలానా భూభాగాలు దీవుల కిందకు వస్తాయా? తన ప్రత్యేక ఆర్థిక ప్రాంతం ఎంతవరకు విస్తరించింది? వంటి ప్రశ్నలను న్యాయస్థానం ముందు ఉంచింది. పరోక్షంగా చైనా వనరుల దురాక్రమణదారా? కాదా? చెప్పాలని అడిగింది. న్యాయస్థానం ముందుకు రావడానికి చైనా నిరాకరించింది. 1970కి ముందు ఆ దీవి తనదిగా ఉందని, రాత్రికి రాత్రి దాన్ని ఫిలిప్పీన్స్ ఆక్రమించిందని అంటోంది. సరిహద్దు వివాదం ఐరాస సముద్ర చట్టాల ఒప్పందం పరిధిలోకి రాదని, దానిపై తీర్పుఇచ్చే అధికారం న్యాయస్థానానికి లేదని చైనా దబాయించింది.

శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పునకు 1982 నాటి ఒప్పందంపై సంతకం చేసిన దేశాలన్నీ కట్టుబడి ఉండాల్సిందే. తీర్పును చైనా అంగీకరించబోనని అంటే దౌత్య పరమైన వివాదాలకు తెర లేస్తుంది. పారిశ్రామికంగా దూసుకుపోతున్న చైనా ఇంధన సమస్యలన్నింటినీ సముద్రం తీర్చేయగలదు. 2011లో వియత్నాం పార్సిల్ దీవుల్లో చమురు వెలికితీత కాంట్రాక్టు భారతీయ కంపెనీకి అప్పగిస్తే చైనా అక్కడ తన యుద్ధ నౌకల కవాతు చేయించి ఉద్రిక్తతలు సృష్టించింది. 1970లో ఫిలిప్పీన్స్ పాగా వేసిన మరో ద్వీప సముదాయం కూడా తనదంటూ చైనా గొడవకు దిగింది. ఆ ప్రాంతంలో చిన్నచిన్న దిబ్బలను ఆక్రమించి కాంక్రీటు కట్టడాలతో దీవులుగా మార్చడం మొదలెట్టింది. అక్కడ చైనా చేపల వేట ముమ్మరం కావడంతో ఫిలిప్పీన్స్ బలప్రయోగం చేయాల్సి వచ్చింది. చివరకు ఇరు దేశాలు చర్చలతో పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.

దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు ఎక్కువ కావడంతో అక్కడున్న తన మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికా రంగంలోకి దిగింది. అక్కడ యుద్ధ నౌకలను మోహరించింది. దాంతో ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయి. హేగ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఆగ్నేయా ఆసియాలో మరింతగా ఉద్రిక్తతలు రాజేసే అవకాశముంది. దక్షిణ చైనా సముద్రం పై పట్టు కోసం చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పును లెక్కచేయని చైనా మరింత రెచ్చిపోతోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఆంక్షలు విధించింది. కొంత భాగాన్ని మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మూడు రోజుల పాటు ఇక్కడ సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు చైనా సిద్ధమైంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతం. చైనా ప్రాబల్యంలోకి వెళ్లిందంటే మిగతా దేశాలకు కష్టాలే. అందుకే ఈ రగడ!

Leave a Reply