టీడీపీ లో త్రిభుజం..అదీ చీరాల విశేషం

450
Chirala constituency leaders amanchi krishna mohan pothula sunitha and paleti rama rao not talking in mahanadu

టీడీపీ మహానాడులో ఎన్నో విశేషాలు.వేదిక మీదే నాయకులు కొందరు గ్రూపులవారీగా కూర్చున్నారని వార్తలు వచ్చాయి.ఇందులో నిజమెంతో కానీ ఓ నియోజకవర్గం నుంచి మహానాడుకి హాజరైన నేతలు మాత్రం ఆ ప్రాంగణంలో ఉప్పునిప్పులా మెలిగారు.అదే చీరాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకటి కాదు ..రెండు కాదు …ఏకంగా మూడు గ్రూపులు వున్నాయి.ఆ మూడు గ్రూపులకి నాయకత్వం వహిస్తున్న నేతలు తమ అనుచరగణంతో వేర్వేరుగా మహానాడుకి హాజరు అయ్యారు.

చీరాల టీడీపీ లో స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య ఆధిపత్య పోరాటం అందరికీ తెలిసిందే.ఇండిపెండెంట్ గా ఆమంచి,టీడీపీ అభ్యర్థి సునీత మీద గెలిచారు.ఆపై టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.దీంతో రెండు వర్గాల మధ్య సమన్వయము సాధ్యం కావడం లేదు.ఆ గొడవకి ఫుల్ స్టాప్ పెడదామనే అధిష్ఠానం సునీతకి ఎమ్మెల్సీ ఇచ్చింది.అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.రాజీ కుదరకపోగా విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి.ఈ గొడవలు ఇలా జరుగుతుండగానే ఆమంచికి వ్యతిరేకంగా పార్టీ నాయకుడు ,మాజీ మంత్రి పాలేటి రామారావు యాక్టివ్ అయ్యారు.ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన పాలేటి ఆ తర్వాత కాలంలో టీడీపీ లోనే ఉన్నప్పటికీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బలరాంతో విభేదాలతో పార్టీని వదిలి వెళ్లారు.రాజకీయ భవిష్యత్ ని వెదుక్కుంటూ ప్రజారాజ్యం,వైసీపీ కి వెళ్లినా అక్కడ ఇమడలేక చివరకు టీడీపీ గూటికే చేరారు.చేరినప్పటికీ కొన్నాళ్ళు పెద్ద యాక్టివ్ గా లేరు.కానీ స్థానిక రాజకీయ ఒత్తిళ్ల తో పాలేటి యాక్టివ్ అయ్యారు.దీంతో కొన్ని విషయాల్లో ఆయన ఎమ్మెల్యే ఆమంచితో తలపడవలసి వస్తోంది.ఇలా చీరాల నియోజకవర్గంలో ముక్కోణపు రాజకీయం టీడీపీ లో నడుస్తోంది.

ఇలా ఉప్పునిప్పులా వుండే ఈ ముగ్గురు నాయకులు మహానాడు ప్రాంగణంలో ఒక్క చోట కాకుండా తలా ఒక్క చోట తమతమ అనుచరులతో దర్శనమిచ్చారు.ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు కదా ..కనీసం ఒకరివైపు ఇంకోరు చూసుకున్న సందర్భాలు తక్కువే.ఎమ్మెల్యే ఆమంచికి టీడీపీ వాతావరణం నిజంగా కొత్తే.ఇక పాలేటి తనకున్న పాత పరిచయాలతో మహానాడు ప్రాంగణంలో సీనియర్ నేతలతో బాగానే కలివిడిగా మాట్లాడుతూ కనిపించారు.ఇక పోతుల సునీత తన అనుచరులతో విడివిడిగా కనిపించారు.వీళ్ళు విడివిడిగా వచ్చినా,ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా ఎవరికి నష్టం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.

చీరాల టీడీపీ పరంగా పెద్ద బలమైన నియోజకవర్గం కాదు.అయినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీ మీద అభిమానంతో కొందరు టీడీపీ కోసం అన్ని విధాలుగా పనిచేస్తూ వచ్చారు.వీరికి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కొత్త సమస్య వచ్చిపడింది.చీరాల టీడీపీ లో ఏ నాయకుడితో దగ్గరా మసలాలో అర్ధం కాక వీరు అల్లాడిపోతున్నారు.ఒకరిదగ్గర కనిపిస్తే ఇంకోరికి కోపం.ఈ పరిస్థితుల్లో వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు.అయినా పార్టీ మీద ఇష్టంతో విశాఖ మహానాడుకి తరలివచ్చారు.ఇక్కడ కూడా ముగ్గురు టీడీపీ నాయకుల మధ్య ముక్కోణపు పోటీ చూసి వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారు.పరాయి చోట పలరించకపోతే బాగుండదని ఒకరికి కనిపించకుండా ఇంకో నేతని …ఇలా ముగ్గురుని ఆ జనసందోహంలో కలవడమే వారికి పెద్ద పని అయ్యింది.రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదన్నట్టు ఇక్కడికి వచ్చినా ఈ దాగుడు మూతలు తప్పలేదని వాళ్ళు వాపోతున్నారు.ఈ విషయాన్ని ఆ నేతలకు ఎవరు చెప్పగలరు? ఈ సమస్యకి ఏ పరిష్కారం దొరుకుతుంది ? నేతలు మారితే తప్ప ..కనీసం మారాలని అనుకుంటే తప్ప.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here