మీసం తిప్పిన దాసరి!!

Posted February 4, 2017

chiranjeevi meets dasari narayana rao in kims hospital
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దర్శకరత్న దాసరి నారాయణ రావు క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ… పరామర్శలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందుతో పోలిస్తే దాస‌రి హెల్త్ బాగా మెరుగుపడిందని చెబుతున్నారు. ముఖ్యంగా కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి వచ్చినప్పుడు దర్శకరత్న బాగా యాక్టివ్ గా కనిపించారు.

ఐసీయూలో ఉండి కూడా దాసరి ఆలోచనలు సినిమాల చుట్టే తిరుగుతున్నాయి. చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. మెగాస్టార్ ఆస్పత్రిలోకి వెళ్లగానే దాసరి ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ గురించి ఆరా తీశారట. తాను మాట్లాడలేకపోతుండడంతో.. పేపర్ పై రాసి ఇచ్చారట. దీనికి మొదట ఆశ్చర్యపోయిన చిరు చాలా సంతోషంగా 150 కోట్లని చెప్పారట. దీనికి పొంగిపోయిన దాసరి మీసం మెలేశారట. సినిమా ఈ రేంజ్ లో హిట్ కావ‌డంపై త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని సైగ‌ల ద్వారా చెప్పారట‌. అంతేకాదు ఖైదీ 250 కోట్ల కలెక్షన్లను రాబట్టాలని పెద్దాయన ఆకాంక్షించారని చిరు చెప్పుకొచ్చారు.

దాస‌రి మీసం మెలేయ‌డం చూసి ఆస్ప‌తి సిబ్బంది, డాక్ట‌ర్లు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ కండిష‌న్ లో ఉండి కూడా ఎంత ఎన‌ర్జీ ఉండ‌డం గొప్ప విష‌య‌మ‌న్నార‌ట‌. దీన్ని బ‌ట్టి చూస్తే… ఇక దాస‌రి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్చ్ కావ‌డానికి ఇంకా ఎంతో స‌మ‌యం పట్ట‌ద‌ని తెలుస్తోంది.

మొత్తానికి దాసరి ఆస్పత్రిలో ఉండి కూడా తన సినిమాపై ఇంత ఎగ్జయిటింగ్ గా ఉండడంతో చిరంజీవి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆస్పత్రికి వచ్చేప్పుడు ముభావంగా కనిపించిన ఆయన.. మీడియాతో మాట్లాడిన తర్వాత ఆనందంతో కారెక్కారు. మరి దాసరి ప్రశంసలకు ఆ మాత్రం సంతోషం ఉండాల్సిందే!!!

SHARE