Posted [relativedate]
అవును మీరు విన్నది నిజమే. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. అత్యవసర సందర్భాల్లో తప్ప మిగతా విషయాల్లో ఉత్తర ధృవం, దక్షిణ ధృవంగా ఉండే చిరు, పవన్ లు కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు.
బ్రహ్మాండమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న చిరు.. ఖైదీనెం. 150తో తన స్టామినాను మరో సారి నిరూపించుకున్నాడు. ఇక పవన్ తన పవనిజంతో టాలీవుడ్ టాప్ హీరోగా స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతటి ఇమేజ్ ను సాధించిన మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఓ మల్టిస్టారర్ చేస్తే చూడాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరు కూడా మంచి కథ వస్తే తాను పవన్ తో మల్టిస్టారర్‌లో నటించేందుకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా ప్రముఖ నిర్మాత, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కూడా ఆ మల్టీ స్టారర్ ని తాను నిర్మిస్తానని ఖైదీ నెం.150 పార్టీ సందర్భంగా ఎనౌన్స్ చేశాడు. సుబ్బిరామిరెడ్డి, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. దానికి సంబంధించిన కథ కూడా ఓకే అయిందని, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నామని అధికారికంగా చెప్పేశారు నిర్మాతలు.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన జల్సా, అత్తారింటికి దారేది.. అలాగే ఆయన కధ, మాటలు అందించిన చిరు సినిమా జై చిరంజీవ ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఇంతటి హేమాహేమీల కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో.. ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.