Posted [relativedate]
ఆనం బ్రదర్స్ రాం నారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి మధ్య విభేదాలొచ్చాయా? టీడీపీ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయా? ఇక ఇద్దరూ చెరోదారిలో పయనించనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
నిజానికి ఆనం బ్రదర్స్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. ఒకదశలో ఆనం రాం నారాయణ రెడ్డి పేరు సీఎం రేసులోనూ వినిపించింది. అలాంటిది రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో ఆనం బ్రదర్స్ ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. చివరకు రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం కావడంతో సోదరులిద్దరూ టీడీపీలో చేరిపోయారు. దీంతో చంద్రబాబు కూడా తగిన ప్రాధాన్యం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఆత్మకూరు టీడీపీ ఇంఛార్జ్ తో రాం నారాయణరెడ్డి ని నియమించారు. దీంతో ఆయన అక్కడ యాక్టివ్ అయ్యారు.
అయితే వివేకా విషయమే ఇంకా ఎటూ తేలలేదు. వేచి చూడాలని చెప్పినా… ఆయన మాత్రం వెయిట్ చేయడం లేదట. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని బాబును కోరారట. కానీ బాబు మాత్రం కుదరదని వివేకాకు గట్టిగానే చెప్పారని టాక్. ఎందుకంటే టీడీపీలో మొదట్నుంచి ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. వారిని కాదని వివేకాకు టికెట్ ఇవ్వాలనడం ఎంతవరకు సముచితం? అందుకే కుదరదని బాబు చెప్పారట. దీంతో వివేకా ఇక టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు వార్తలొచ్చాయి. సోదరుడు ఆనం రాం నారాయణ రెడ్డితోనూ విషయం చెప్పారట. ఇద్దరం పార్టీని వీడి వెళ్లిపోదామని చెప్పారట. దీనికి రాం నారాయణ రెడ్డి అంగీకరించలేదని టాక్. దీంతో ఆయనపైనా వివేకా అసహనం వ్యక్తం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొంత ఓపిక పట్టాలని సోదరుడు నచ్చజెప్పినా వివేకా లెక్కచేయడం లేదట. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి మరింత బలం చేకూరుస్తూ… తమ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విలేకరుల దగ్గర ఆఫ్ ది రికార్డ్ గా వివేకా చెప్పారట. అంతేకాదు ఆయన త్వరలోనే టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అదే జరిగితే సోదరులిద్దరూ చెరో పార్టీ అయిపోతారు. అప్పుడు రాజకీయం ఎలా ఉంటుందో!! ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్థమవుతారా? వాగ్బాణాలు సంధించుకునేందుకు ఇష్టపడతారా? చూడాలి.