రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జోరు!!

0
508
congrees speed up in rangareddy

Posted [relativedate]

congrees speed up in rangareddyరంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పుంజుకుందా? టీఆర్ఎస్ కు ఎదురుగాలి మొదలైందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ లబ్ధి జరగనుందా? అంటే ఔననే అంటున్నాయి హస్తం శ్రేణులు.

గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నది. చివరకు బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన కార్తీక్ రెడ్డి కూడా ఎంపీగా పోటీచేసి ఓటమిని మూటగట్టుకున్నారు. గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీనికి తోడు సబితా ఇంద్రారెడ్డి వర్గానికి చెందిన చాలామంది అధికార పార్టీలోకి జంప్ అయిపోయారు. జిల్లాల పునర్విభజనతో ఇక రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం కష్టమేనని ప్రచారం జరిగింది. కానీ అది తప్పని తాండూరు మున్సిపల్ ఎన్నికలతో తేలిపోయింది.

మంత్రి మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆయనకే కాంగ్రెస్ షాకివ్వడం చర్చనీయాంశంగా మారింది. అది జస్ట్ శాంపులేనంటున్నారు హస్తం నేతలు. ఎందుకంటే అధికార పార్టీపై వ్యతిరేకత మొదలైందనే వాదన వినిపిస్తోంది. మంత్రిగా మహేందర్ రెడ్డితో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలందరికీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని టాక్.

ముఖ్యంగా మహేందర్ రెడ్డితో పాటు సంజీవరావు, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి వారందరూ మొదటి నుంచి టీఆర్ఎస్ లో లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. దీంతో టీఆర్ఎస్ నాయకులతో వారికి పొసగడం లేదని టాక్. దీనికి తోడు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా తోడవుతోందన్న వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్సే కాబట్టి.. ఇదంతా ఆ పార్టీకే ప్లస్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.

తాండూరు గెలుపుతో మొదటి అడుగు పడిందని సబిత వర్గం చెబుతోంది. ఒక్క అడుగుతో మొదలై రెండు జిల్లాల్లోనూ పూర్వ వైభవం సాధిస్తామని ఆ పార్టీ ఆశిస్తోంది. అయితే వారి ఆశలు నెరవేరుతాయా? లేక తుస్సుమంటాయా? అన్నది తేల్చేది ప్రజలే. కాబట్టి ఇక ప్రజల్లోకి వెళ్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి దీనికి టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుందా.. వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కొత్త వ్యూహం రచిస్తుందా? చూడాలి.

Leave a Reply