జగన్,బీజేపీ మీదే కాంగ్రెస్ ఆశలు..

Posted May 18, 2017 at 18:59

congress hopes on ysrcp and bjp alliance in ap
శత్రువు శత్రువు మిత్రుడు అనేది సహజ పరిణామం.కానీ శతృవుకి ఇంకో శత్రువు తోడు అయితే మనకి మేలు అన్నది రాజకీయపు ఎత్తుగడ.ఇప్పుడు ఈ ఎత్తుగడనే నమ్ముకుని ఏపీ లో తిరిగి పుంజుకుంటామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఆ విషయాన్ని కాస్త వివరంగా చూద్దాం.దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ధాటికి కాంగ్రెస్ కుదేలు అవుతోంది.ఇక విభజన పాపం మూటగట్టుకున్న ఏపీ లో పరిస్థితి మరీ దారుణం.అక్కడ జగన్ నేతృత్వంలోని వైసీపీ తో జట్టుకట్టి ఎలాగోలా బతికిబట్టగట్టాలని కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.దానికి తగ్గట్టే ఆ పార్టీ ఢిల్లీ నేతలు దిగ్విజయ్ మొదలుకొని గల్లీ నేతలు దాక జగన్ కి అనుకూలంగా చంద్రబాబుని తిట్టేస్తూ ప్రకటనలు చేశారు.ఇంతలో జగన్ ఢిల్లీ వెళ్లడం,వైసీపీ తారాస్థాయిలో మోడీ భజన చేయడం కాంగ్రెస్ ని తీవ్ర నిరాశకి గురి చేసింది. అయితే కాలం గడిచే కొద్దీ అదే పరిణామం తమకి వరంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

బీజేపీ, జగన్ మధ్య బంధం కేవలం ప్రకటనలకే పరిమితం గాకుండా ఎన్నికల పొత్తు దాకా వెళితే బాగుంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.దీనివల్ల ఒకప్పుడు కాంగ్రెస్ కి అండగా వుంది తర్వాత వైసీపీ వెంట నడిచిన మైనారిటీ,క్రైస్తవ వర్గాలు తిరిగి పాతగూటికి చేరతాయని హస్తం నేతల అభిప్రాయంగా వుంది.అందుకే నిన్నమొన్నటి దాకా జగన్ ని పల్లెత్తి మాట అనని హస్తం నేతలు ఇప్పుడు ఆయన్ని చీల్చి చెండాడుతున్నారు.నిజంగానే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ,జగన్ మీదే ఆశలు పెట్టుకుందదనడంలో ఆశ్చర్యం ఏముంది?

SHARE