Posted [relativedate]
చీటికీ మాటికీ టీడీపీ అంతర్గత వ్యవహారాలపై తెగ విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఊహించని షాక్ ఎదురైంది. తలసానికి అసలు మంత్రి పదవి లైసెన్స్ ఎక్కడుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు పట్టుకోలేదని ఎగిరి గంతేస్తే సరిపోదని, లైసెన్స్ లేని డ్రైవర్ కు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష తప్పదని, తలసాని మంత్రి పదవి కూడా ఎప్పుడు ఊడుతుందో ఆయనకే తెలియదని సెటైరేశారు జీవన్ రెడ్డి.
టీడీపీలో ఉన్నప్పుడు కాస్త అదుపులో ఉన్న తలసాని.. క్యాడర్ తో మమేకం కావడానికి ప్రయత్నించేవారు. కానీ టీఆర్ఎస్ లో చేరాక కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని తలకెక్కించుకున్నారని తెలంగాణ తమ్ముళ్లు ఇప్పటికే విమర్శిస్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి విమర్శలతో వారి వాదనకు బలం చేకూరింది. మంత్రి కాగానే ఏదో అద్భుతం జరిగిందన్నట్లుగా కలల కంటున్న తలసాని.. టీడీపీ అధినేత చంద్రబాబును, కాంగ్రెస్ అగ్రనేతల్ని కూడా నోటికొచ్చినట్లు తిడుతూ కేసీఆర్ ప్రాపకం కోసం పనిచేస్తున్నారు.
గతంలో ఆయన్ను వెన్నంటి ఉన్న క్యాడర్ ను గాలికొదిలేశారు. ఇక కొడుకును అచ్చోసిన ఆంబోతులాగా రోడ్డు మీదకు వదలారని, ఆయన చేసే పనులే తలసాని కొంప ముంచుతాయని టీఆర్ఎస్ అధిష్ఠానానికి కూడా నివేదిక అందింది. పైగా వచ్చే ఎన్నికల్లో తలసాని స్థానంలో మరో ప్రత్యామ్నాయ నేతను కూడా గులాబీ పార్టీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు తలసాని అవాకులు చెవాకులు పేలడం ఎందుకని, 2019 ఎన్నికల్లో తన భవిష్యత్ ఏంటో చూసుకోవాలని అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాయి.