Posted [relativedate]
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఆ మంటల్లో ఇంకోడు చలి కాచుకుంటున్నాడట. ఈ నానుడి ఇప్పుడు తెలంగాణ కి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు అతికినట్టు సరిపోతుంది.అసలే వరస పరాజయాలతో దిక్కు తోచని స్థితిలో పడ్డ కాంగ్రెస్ అధినాయకత్వం మీద ఇదే అదనుగా తమదైన ప్లాన్స్ వేస్తున్నారు.పార్టీకి కొత్త ఉత్తేజం తెచ్చే ఆలోచనలు పక్కనబెట్టి తాము కాంగ్రెస్ లో ఎదగడానికి దారులు వెదుక్కుంటున్నారు.ఇంతకీ ఆ నేతలు ఎవరో తెలుసా …ఒకరు మర్రి శశిధర్ రెడ్డి,ఇంకోరు మధు యాష్కీ .ఆ ఇద్దరూ ఏమి చేస్తున్నారో చూద్దాం.
దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్ ని అలా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు రాహుల్ గాంధీ.దీంతో ఆయన నాయకత్వం మీద నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా అదే పార్టీ నీడలో ఉంటున్న నాయకులు సైతం రాహుల్ మీద అపనమ్మకంతో చూస్తున్నారు.ఈయన కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేగలరా అని డౌట్ పడుతున్నారు.
కానీ శశిధర్ రెడ్డి, మధు యాష్కీ మాత్రం ఇదంతా హైకమాండ్ కి దగ్గరగా వున్న వృద్ధనేతలు అహ్మద్ పటేల్,గులాం నబి ఆజాద్,దిగ్విజయ్ సింగ్ వంటి వారి మీదకు తోసి తాము 10 జన్ పథ్ కి దగ్గరయ్యే ఆలోచన చేస్తున్నారు.ఈ వ్యవహారంలో శశిధర్ ఇంకో అడుగు ముందుకేసి ఆ వృద్ధ జంబూకాల్ని వదిలించుకోమని ఏకంగా సోనియా గాంధీ కే లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ ప్లేస్ లో రాహుల్ యూత్ ఫుల్ టీం ని తయారు చేసుకోమని చెపుతూ కాస్త మా సంగతి కూడా చూడమని నసుగుతున్నారట.వీళ్ళ కోరిక చూస్తే రాహుల్ టీం పేరుతో కాంగ్రెస్ హైకమాండ్ లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నట్టు వుంది.కానీ వీళ్ళని వీళ్ళు యూత్ ఎలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు.శశిధర్ రెడ్డి 1949 లో పుట్టారు.అంటే దాదాపు 68 ఏళ్ళు.ఇక మధు యాష్కీ 1960 లో పుట్టారు.ఆయనకి 56 ఏళ్ల పైమాటే. ఈ ఇద్దరూ యూత్ అయితే ఇక కాంగ్రెస్ కాటికి కాళ్ళు ఆరజాపుకున్న పండు ముదుసలే..ఎనీ డౌట్ ?