Posted [relativedate]
ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్న జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు మద్దతివ్వడంపై కాంగ్రెస్ ఆలోచనలో పడింది. ఈ మధ్య ఆయన ఏ కార్యక్రమం చేపట్టిన హస్తం నాయకులు సంపూర్ణ మద్దతు పలుకుతూ వచ్చారు. ఆయన వాదనలో బలముందంటూ కోదండరాంకు జై కొడుతున్నారు.
అయితే ఏ విషయంలోనైనా ఎక్కువగా ఊహించే హైకమాండ్ పెద్దలు…. టీ.కాంగ్రెస్ కు కూడా కోదండరాం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారట. ప్రొఫెసర్ గారికి మద్దతివ్వడం ఓకే గానీ.. క్రెడిట్ అంతా ఆయనకే పోతుందని చెప్పారట. ఏం చేసినా తమకంటూ కొంత ప్రయోజనం చూసుకోవాలని సూచించారని టాక్. కోదండరాం కు మద్దతిస్తే.. ఆ క్రెడిట్ ఆయనకే పోతుంది.. తప్ప తాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నా..ఎలాంటి మైలేజ్ రాదని హైకమాండ్ పెద్దల భావన.
పార్టీ పెద్దల ఆలోచన ప్రకారం ఇక కోదండరాం విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని టీకాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ గారికి కూడా వివరించారట. దీంతో ఈ వాదనలో బలం లేదని ఆయన కూడా టీ.కాంగ్రెస్ నేతలకు చెప్పారట. ఏ నిరసనలో పాల్గొన్నా… పార్టీ పరంగా కాంగ్రెస్ కు కూడా కొంత లాభం జరుగుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే హైకమాండ్ ఆలోచనలకు భిన్నంగా టీ.కాంగ్రెస్ ఏ పని చేయలేదు. కాబట్టి ఇక కోదండరాంకు ఇకపై మద్దతు అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు. అయితే ఈ క్రెడిట్ గోలపై టీ.కాంగ్రెస్ లోనే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి కోదండరాం సరైన వేదిక కల్పిస్తుంటే… ఈ క్రెడిట్ లొల్లితో వెనకడుగు వేయడం సరికాదంటున్నారని టాక్.