Posted [relativedate]
చిరు మావాడే అన్న కాంగ్రెస్ నేతల మాటల తాలూకా రీసౌండ్ ఆగిపోకముందే హస్తం నేతల నాలుక మడత పడింది.ఢిల్లీ నుంచి ఏ ఆదేశం మోసుకొచ్చాడో గానీ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చేసరికి మొత్తం సీన్ అంతా మారిపోయింది.ఆయనతో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ నేతలంతా జగన్ భజన మొదలెట్టారు.కడపలో వై.ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేసి టీడీపీ లో పదవులు అనుభవించి ప్రజారాజ్యంలో చేరి,చిరు దయతో కాంగ్రెస్ పంచకు చేరిన సి.రామ చంద్రయ్య సైతం జగన్ స్తోత్రం అందుకోవడం మారిన పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇలా ఎందుకు జరుగుతుందో విశ్లేషించే ముందు అసలు కాంగ్రెస్ నేతల భజన ఎలా వుందో చూద్దాం.. రామచంద్రయ్య మాటల్లో చెప్పాలంటే ” చంద్రబాబు నాయుడు వెన్నుపోట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు.కానీ జగన్ ప్రజల అభిమానం,ఆదరణతో ప్రతిపక్ష నేతగా ఆవిర్భవించాడు”.ఇక దిగ్విజయ్ మాటల్లో చెప్పాలంటే “అవినీతి,అక్రమార్జన విషయంలో జగన్ ని విమర్శించడానికి ఎన్నో ఆర్ధిక ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకి అర్హత లేదు”.
కాంగ్రెస్ నేతలకు ఒక్కసారిగా ఇలా జగన్ మీద ప్రేమ పుట్టడానికి అసలు కారణం వేరే వుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ కి దూరమైన అంశాన్ని అడ్డుపెట్టుకుని కమలనాథులకు దగ్గరై కేసుల నుంచి బయటపడదామని జగన్ హస్తినలో ఎన్నో ప్రయత్నాలు చేశారు.కానీ నో యూజ్.ఆ లోగుట్టు కనిపెట్టిన కాంగ్రెస్ జగన్ ని బుట్టలో వేసేందుకు ట్రయల్స్ మొదలెట్టింది.జగన్ కి కూడా ఏదో ఒక జాతీయ పార్టీ అవసరం వుంది.అందుకే ఇద్దరూ మళ్లీ ఎవరూ చూడకుండా కన్ను గీటు కుంటున్నారు.
ఇక ఈ మధ్య చిరు సీఎం అభ్యర్థి అని కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ గురించి జగన్ ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని చెప్పిన 10 జన్ పథ్ ప్రతినిధులు ఆయన్ని బుజ్జగించారట.అందుకే చిరుమాట వినపడకుండా పెద్దగా జగన్ భజన మొదలెట్టారు.అందులో ముందుగా భజన అందుకున్న రామచంద్రయ్య చిరు వల్లే ఇప్పటి పొజిషన్ కి వచ్చిన విషయం కూడా మర్చిపోయి చెలరేగుతున్నాడు.అయినా రాజకీయాల్లో,నేతల్లో నైతికత వెదకడం మన తప్పే..