Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మన దేశంలో ఇతర పార్టీలకు, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు చాలా తేడా ఉంది. వయసే కదా అంటారా. అది కాదండీ ఎన్నికల్లో ఓడిపోవడంలో కూడా హస్తం నేతలది సెపరేట్ స్టైల్. మిగతా పార్టీలు ప్రత్యర్థుల బలం వల్ల ఓడిపోతే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత కలహాలతోనే కుప్పకూలుతుంది. దేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్రాలు చేజారుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదు. తెలంగాణ ఇచ్చి బంగారు పళ్లెంలో కేసీఆర్ కు అప్పగించిన ఘనత వహించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసారి నవ్వుల పాలయ్యారు.
తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి మరణాలపై సీరియస్ అయిన మహిళా కాంగ్రెస్ నేతలు.. హెచ్చార్సీకి ర్యాలీ తీశారు. కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ఈ ర్యాలీ జరిగింది. అయితే ర్యాలీలో కేసీఆర్ డౌన్ డౌన్ అనకుండా.. కేసీఆర్ జిందాబాద్ అనడం సీనియర్ నేతల్ని ఆశ్చర్యపరిచింది. ఏదో ఒకసారి జరిగిందంటే పొరపాటు అనుకోవచ్చు. ఒకటికి రెండుసార్లు అదే తప్పు రిపీట్ కావడంతో.. సీనియర్లు కలగజేసుకుని నినాదాల్ని సరిచేయాల్సి వచ్చింది. దీంతో అసలు వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలేనా అనే అనుమానం కూడా వచ్చింది.
కాంగ్రెస్ ఇంత దెబ్బ తిన్న తర్వాత కూడా చిన్న ర్యాలీ విషయంలో ప్లాన్ లేకుండా వ్యవహరించిందని అర్థమవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశతో కేసీఆర్ జిందాబాద్ అన్నారా.. లేదంటే అసలు వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు కాదా అని మాజీ మంత్రులు కూడా సరిచూసుకోవాల్సి వచ్చింది. తరచుగా ప్రజాసమస్యలపై నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు తీయకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని మరికొందరు నేతలు పీసీసీపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా సీనియర్లు కళ్లు తెరిచి గాంధీ భవన్ వదిలి జనంలోకి రావాలని క్యాడర్ కోరుతోంది.