Posted [relativedate]
వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా హైదరాబాద్ లోనైతే వార్ వన్ సైడ్ గా ఉండేది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులుగా దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పట్టు బిగించారు. ఒక్కసారిగా బడా నాయకులైపోయారు. సిటీ మొత్తం చక్రం తిప్పారు. కానీ కాంగ్రెస్ కు పవర్ పోవడంతో ఇప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది.
ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా మంత్రి హోదాలో ఒకప్పుడు బాగా హల్ చల్ చేసేవారు దానం నాగేందర్. కటౌట్లు, ఫ్లెక్సీలు, గానా బజానాలతో ఢిల్లీ పెద్దలకు స్వాగతం లభించేది. ఈ అతిథి మర్యాదలకు వారు కూడా ఉప్పొంగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దానం నాగేందర్ … ఎవరొచ్చినా పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అంతెందుకు ఆ మధ్య ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఆయన సైలెంట్ గా ఉన్నా… ఆయన అంతరంగం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే వారే కరువయ్యారు.
వైఎస్ హయాంలో మంత్రిగా చక్రం తిప్పిన ముఖేష్ గౌడ్ అయితే పార్టీలో కనిపించక చాలారోజులైపోయింది. బల్దియా ఎన్నికల్లో ఆయన కుమారుడిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించినా లాభం లేకపోయింది. మేయర్ మాట అటుంచి… కనీసం కుమారుడిని కార్పొరేటర్ గా కూడా గెలిపించుకోలేక చేతులెత్తేశారు. ఎన్నికలయ్యాక పార్టీ వైపు ఆయన చూడడం మానేశారు.
అటు సిటీలో అంతో ఇంతో పార్టీ ఉనికిని కాపాడుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన అంజన్ కుమార్ యాదవ్ ఒక్కరే. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. ఇంతకు ముందున్న ఉత్సాహం ఆయనలో లేదన్న వాదన వినిపిస్తోంది. ఆయన కుమారుడే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా… ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఒకప్పుడు త్రిమూర్తులుగా హైదరాబాద్ కాంగ్రెస్ కు ఆయువు పట్టుగా నిలిచిన ఈ ముగ్గురూ … ఇప్పుడు దూకుడు తగ్గించడంతో… పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో సిటీలో టీఆర్ఎస్ దూకుడు పెంచితే… కాంగ్రెస్ లో మాత్రం పూర్తిగా నైరాశ్యం నెలకొంది. చివరకు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉండడమే అందుకు నిదర్శనం. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి… కనీసం డిపాజిట్ అయినా కాంగ్రెస్ కు దక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.