అఖిలేశ్ గుప్పిట్లో సైకిల్?

0
500
cycle in akhilesh hands

Posted [relativedate]

cycle in akhilesh hands
యూపీ అధికార పార్టీలో చీలిక వచ్చేయడంతో ములాయం- అఖిలేశ్ చెరో దారి చూసుకున్నారు. అయితే పార్టీ సింబల్ కోసం మాత్రం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇప్పటికీ సింబల్ పోరు ఈసీ దగ్గరకి వెళ్లింది. సైకిల్ ఎవరికి దక్కుతుందో ఈసీయే తేల్చనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సభ్యుల జాబితాలను వారి అఫిడవిట్లతో సహా ఎన్నికల కమిషన్ పరిశీలించనుంది. ఈ మేరకు ఈనెల 9వరకు గడువు విధించింది.

సైకిల్ పై ఈసీ తేల్చనున్న నేపథ్యంలో ములాయం కంటే అఖిలేశ్ వర్గం దూకుడు పెంచింది. మరో ఏడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు అఖిలేశ్. అంతేకాదు తన వర్గానికి చెందిన నేతలందరి అఫిడవిట్లు తీసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే అఖిలేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. వారి సంతకాలు, అఫిడవిట్లు తీసుకున్నారు. వీరిలో 200 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అఫిడవిట్లు ఇచ్చారని సీఎం వర్గీయులు చెబుతున్నారు.

అఖిలేశ్ వేగంగా దూసుకుపోతుంటే.. ములాయం వర్గం మాత్రం ఢీలా పడింది. పార్టీ పదాధికారులు గానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గానీ ఎక్కువ సంఖ్యలో ములాయంకు మద్దతివ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ములాయంకు మద్దతుగా పెద్దగా అఫిడవిట్లు రాలేదట. ములాయం వైపు ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా అఖిలేశ్ బ్యాచ్ లో చేరిపోతున్నారట. అమర్ సింగ్, శివపాల్ యాదవ్ తప్పుడు సలహాల వల్లే ఇలా జరుగుతోందన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.

మొత్తానికి ములాయంకు సైకిల్ దక్కే అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగుతోంది. సైకిల్ ఇప్పటికే అఖిలేశ్ గుప్పిట్లోకి వచ్చేసిందని టాక్. ఈసీ అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని పరిశీలకుల అంచనా.

Leave a Reply