దాసరి కన్నుమూత

0
368
Dasari Narayana Rao Passed Away

దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూశారు.ఈసాయంత్రం 7 గంటలకు ఆయన మృతి చెందినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు.అన్నవాహిక ఇన్ఫెక్షన్ సహా వివిధ అంతర్గత అవయవాల పనితీరు మందగించి వారం కిందట ఆయన్ను కిమ్స్ లో చేర్చారు.నాలుగు రోజుల కిందట అన్నవాహిక కి సస్త్ర చికిత్స నిర్వహించినా ఫలితం లేకపోయింది.ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు.దాసరి మరణ వార్తను కిమ్స్ వైద్యులు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే ఆయన సన్నిహితుడు సి.కళ్యాణ్ బయటికి చెప్పారు.కిమ్స్ నుంచి బయటికి వస్తూ గురువుగారు ఇక లేరు ఆయన బాడీని కొద్దిసేపటిలో తరలిస్తాం అనగానే దాసరి మరణించినట్టు తెలిసింది.

దాసరి మరణవార్త తెలిసిన వెంటనే రాజకీయ,సినీ ప్రముఖులు ఆయనతో వున్న బంధాన్ని నెమరు వేసుకున్నారు.ఆయన చేతుల మీదుగా చిత్రసీమకు పరిచయమైన నటుడు మోహన్ బాబు గురువు గారి మరణాన్ని తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చారు.ఆయన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.ఇంకా చాలా మంది ప్రముఖులు దాసరి భౌతిక కాయాన్ని దర్శించుకుని తమ సంతాపాన్ని ప్రకటించారు.

దాసరి దాదాపుగా ఐదు నెలల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంతకు ముందు కిమ్స్ లో దాదాపు మూడు నెలల చికిత్స,ఓ శస్త్ర చికిత్స తో కోలుకుని ఇంటికి వెళ్లారు.ఇటీవలే అందరి మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని హాయిగా వున్నారు అనుకునేంతలో ఇలా జరిగింది.

డా. దాసరి నారాయణరావు రచయిత దర్శకుడు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. అనంతరం రాజకీయాల్లో సైతం తన సేవలను కొనసాగించారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డుకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1947 మే 4న దాసరి జన్మించారు. బీ.ఏ డిగ్రీలో దాసరి పట్టబధ్రుడు. కాలేజీ రోజుల్లోనే దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవారు. చాలా తక్కువ కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపును తెచ్చకున్నారు. ఎంతో మంది కొత్త కళాకారులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. దాసరి చేతుల మీదుగా పరిశ్రమలో అడుగు పెట్టినవారు చాలా మంది స్టార్లుగా ఎదిగారు. దాసరికి అభిమానులు కూడా ఎక్కువే. 18000 కు పైగా అభిమానసంఘాలు ఉండేవి.

Leave a Reply