ఆ నోటి కంపు.. BJP కి చెంపపెట్టు

0
537

daya sankar singh mouth stench slap bjp
మత స్వేచ్ఛపైనా, భావప్రకటనా స్వేచ్ఛపైనా ఇప్పటి వరకూ చురుకైన మాటలతో ప్రత్యర్ధులపై యుద్ధం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని కూడా ఉపేక్షించడం లేదు. ప్రముఖ దళిత నాయకురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిపై ఉత్తరప్రదేశ్ బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ దారుణమైన వ్యాఖ్యలు చేసి ఘోరమైన తప్పిదం చేశారు. ఎవరైనా సరే మహిళలపై వ్యాఖ్యలు చేయడమే నేరం. అందునా ఒక దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మరింత దారుణం. మాయావతి లాంటి దళిత ప్రతినిధిని అవమానించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. బిజెపి నాయకుడు చేసిన నీచాతి నీచమైన వ్యాఖ్యలు మాయావతిని ఎంతో మనస్తాపానికి గురి చేశాయి.

‘డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు’ అని దయాశంకర్ సింగ్ అన్నారు. కోటి రూపాయలు ఇచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చి అదే స్థానానికి రెండు కోట్లు ఇచ్చే వారు వస్తే పాతవారికి టిక్కెట్ రద్దు చేసి కొత్త వారికి ఇస్తున్నారని చెబుతూ ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దయాశంకర్ సింగ్ దుందుడుకు స్వభావానికి, మహిళలపై చులకన భావాన్ని, దళితులను అవమానించే మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. పార్టీకి చెందిన నాయకుడు ఇలాంటి దళిత వ్యతిరేక భావనలను వ్యక్తీకరించడంతో బిజెపి భావనలు కూడా ఇవే అనే అర్ధం వస్తున్నది. దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తొలుత బీఎస్‌పీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దయాశంకర్ వ్యాఖ్యల్ని ఖండించాయి. పార్లమెంటు యావత్తూ మాయావతికి అండగా నిలిచింది. మహిళను, దళిత నేతను అవమానించిన భారతీయ జనతా పార్టీ వైఖరిని అందరూ ముక్త కంఠంతో నిరసించారు.

ఇప్పటికే గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడుల విషయంపై రగడ నెలకొనగా తాజాగా దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బిజెపిని మరింత ఇరకాటంలో పడేశాయి. దయాశంకర్ వ్యాఖ్యలపై రాజ్యసభ అట్టుడికింది. స్వయంగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అతడి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. మాయావతిని క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళపై నీచమైన పదాన్ని ఉపయోగించడం సరికాదని, దయాశంకర్ వ్యాఖ్యలను పార్టీ తరపున ఖండిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పార్టీ పదవులన్నింటి నుంచి దయాశంకర్‌ను తొలగిస్తున్నట్టు బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. మాయావతిపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంకావని, వీటిని ఖండిస్తున్నామని మౌర్య చెప్పారు. ఇప్పుడు ఎవరు ఎంత సర్ది చెప్పినా బిజెపి ఈ పాపాన్ని కడుక్కోలేదు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది.

అయినా చాలా సందర్భాలలో బడుగుల పట్ల వివరక్ష కొనసాగుతూనే ఉంది. బడుగు బలహీన వర్గాలను చులకనగా చూడటం, మాట్లాడటం పరిపాటి అయింది. చట్ట పరిరక్షణ ఉన్నా కూడా యధేచ్ఛగా సాగుతున్న ఈ వివక్షను రూపుమాపేందుకు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో ఈ వివక్ష ప్రస్పుటంగా కనిపించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో ఈ వివక్ష దేశం మొత్తానికి వెల్లడి అయింది. రోహిత్ వేముల లాంటి భారత మాత ముద్దుబిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేదు అంటూ ప్రధాని నరేంద్రమోడీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించి బిజెపికి ఆ మకిలి అంటకుండా చూడాలనుకున్నా దేశ ప్రజలు నమ్మలేదు.

గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో దళితుల వివక్షకు సంబంధించి అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు రావడం కూడా బిజెపి నష్టం చేకూరుస్తాయి. రాజకీయ పార్టీగా బిజెపికి జరిగే నష్టం కన్నా సమాజంలో కుల వివక్ష మరింత పెరిగితే కలిగే అనర్ధం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల సమాజంలో మత వివక్ష పెరిగినట్లు అంతర్జాతీయ సమాజం కూడా వేలెత్తి చూపుతున్నది. పరమత సహనం సన్నగిల్లితే దేశ మౌలిక వ్యవస్థకే భంగం వాటిల్లుతుంది. వీటన్నింటికి కారణం బిజెపి నేతల వాచాలత్యమే. కుల మతాలకు సంబంధించిన ఏ అంశం చర్చకు వచ్చినా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కొందరు బిజెపి నాయకులకు అలవాటుగా మారింది. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం బిజెపి అధిష్టానవర్గానికి ఉంది.

మత ప్రాతిపదికన ముస్లింలను, క్రైస్తవులను సమాజం నుంచి దూరంగా పంపేయడం వల్ల దేశానికే నష్టం. అదే విధంగా దళితులపై వివక్ష కొనసాగితే ఆ నష్టం రెండింతలవుతుంది. ఇలాంటి వికృత ధోరణులను ప్రదర్శించే నాయకులను ఏ పార్టీ కూడా ఉపేక్షించరాదు. నేడు మాయావతి కి జరిగిన అవమానం ఆమె ఒక్కరికే జరిగినట్లు కాదు. దేశంలోని బడుగు బలహీన వర్గాలకు మహిళలకు జరిగిన అవమానంగా భావించాల్సి ఉంటుంది. బిజెపి తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఇది ఆ పార్టీ నాయకులు చేసిన తొలి తప్పు కాదు. వచ్చే ఏడాది యుపి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి చేటు తెస్తాయని బిజెపి నాయకత్వం ఆందోళన చెందుతూ దయాశంకర్‌పై వేటు వేసింది కానీ రాజకీయ అవసరం లేకపోతే ఈ చర్య తీసుకునేదా? అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. గతంలో జరిగిన చాలా సందర్భాలు దీన్ని రుజువు చేశాయి.

Leave a Reply