Posted [relativedate]
తమిళనాడులో చిన్నమ్మ శశికళ హవా నడుస్తున్న తరుణంలో.. తారాజువ్వలా దూసుకొచ్చారు జయమేనకోడలు దీపా జయకుమార్. ఇప్పుడు అన్నాడీఎంకేలోని అసంతృప్త వర్గమంతా దీప వెన్నంటి నిలుస్తున్నారు. అంతేకాదు రోజురోజుకు దీప వర్గంలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. అలా చేరేవారంతా ఇప్పుడు జయ రేంజ్ లో దీపను అభిమానిస్తున్నారు.
సాధారణంలో తమిళనాడులో వ్యక్తి ఆరాధన ఎక్కువ కాబట్టి… ఇప్పుడు దీప జయకుమార్ పైనా అభిమానుల ప్రేమ ఎక్కువైపోతోంది. జయ అభిమానులు ఎక్కువమంది దీపను ఆమె ప్రతిరూపంగా భావిస్తున్నారు. దీంతో పాపులారిటీలో చిన్నమ్మను మించిపోతున్నారామె. ఈ క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఆమె పేరుతో దీపా పేరవై అన్న అభిమాన సంఘం కూడా ఏర్పాటైంది. ఇందులో ఉన్నవారంతా అన్నాడీఎంకే కార్యకర్తలేనట. దీపపై అభిమానం ఏ రేంజ్ లో ఉందో.. ఇటీవల అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ అర్థమైంది.
పార్టీ పగ్గాలను దీప చేపట్టాలని కోరుతూ… దీపా పేరవై కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంజీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి …ర్యాలీలో దీపకు అనుకూలంగా నినాదాలు చేశారు. అంతేకాదు పలువురు కార్యకర్తలు దీప బొమ్మను తమ భుజంపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలను దీప మాత్రమే నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు.
దీప బొమ్మను పచ్చబొట్టుగా వేసుకునే వారి సంఖ్య పెరుగుతోందట. దీంతో ఈ అభిమానం ఏ మాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ ప్రిపరేషన్ లో ఉన్నారట దీపా జయకుమార్. అభిమానుల ఆశలు ఏమాత్రం వమ్ము చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. కచ్చితంగా ఆర్కే నగర్ నుంచి బరిలోకి దిగి…. చిన్నమ్మకు సవాల్ విసిరేందుకు దీప సిద్ధమవుతున్నారని టాక్.