డిప్యూటీ సీఎంగా దీపా జయకుమార్?

Posted February 14, 2017

deepa jayakumar as deputy cm
బలం నిరూపణలో తాను సత్తా చాటి.. ముఖ్యమంత్రి పీఠమెక్కితే… జయ కుటుంబ సభ్యులను దగ్గరకు తీసుకోవాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారట. ఈ దిశగా జయ మేనకోడలు దీపా జయకుమార్ కు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని సమాచారం. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం అవకాశం ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ సెల్వం సీఎం అయితే… శశికళ తాత్కాలికంగా ఓడిపోతుందేమో కానీ… ఆమె అంత ఈజీగా వెనక్కు తగ్గే రకం కాదు. కాబట్టి సెల్వంకు పార్టీ పరంగా గట్టి పట్టున్న నాయకుడు కావాలి. ఈ పరిస్థితుల్లో అంత తొందరగా అది సాధ్యంకాదు. జయ కుటుంబసభ్యులైతే పార్టీపై పట్టు నిలుపుకోవచ్చు. క్యాడర్ లోనూ భరోసా కలిగించే అవకాశముంది.

జయ వారసురాలు దీప జయకుమార్ పై సెల్వం వర్గానికి ఎన్నో ఆశలున్నాయి. భవిష్యత్తులోనూ పార్టీకి ఆశాకిరణం ఆమేననని భావిస్తున్నారు. జయ తరహాలో పార్టీపై పట్టు సాధించే అవకాశం ఆమెకే ఉందని వారి గట్టి నమ్మకం. అందుకే కొంతమంది అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు… దీప ఇంటికి తరచూ వెళ్తున్నారట. కాబట్టి దీపకు ఎంతోకొంత బలముందని సెల్వం అంచనా వేస్తున్నారు. అంతేకాదు జయ మేనకోడలు తెరపైకొస్తే అయితే శశికళ ఎత్తులు అంత ఈజీగా పారవు. మన్నార్గుడి మాఫియా కథ కంచికి వెళ్లిపోతుంది. అందుకే దీపా జయకుమార్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సెల్వం నిర్ణయించుకున్నారని సమాచారం.

దీపా జయకుమార్ కు అటు ప్రభుత్వంలో.. ఇటు పార్టీలోనూ తగిన ప్రాధాన్యత ఇచ్చే యోచనలో ఉన్నారట సెల్వం. ప్రభుత్వంలో అయితే డిప్యూటీ సీఎం పదవి… పార్టీ పరంగా అయితే ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న మరో పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారట. ఆదిశగా ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఇక ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లోనూ దీపా జయకుమార్ బరిలో నిలబెట్టే యోచనలో సెల్వం సారు ఉన్నారట. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే జయ కుటుంబసభ్యులకు మంచి రోజులొచ్చినట్టే… సెల్వం తర్వాత అన్నాడీఎంకే భవిష్యత్తు తారగా దీప అవతరించే అవకాశముంది!!!

SHARE