తన కష్టం ఇంకోరికొద్దని కదిలిన దీపికా …

   deepika padukone want become psychiatric society brand ambassador
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నిర్ణయించుకుంది.సెలెబ్రెటీలు సామాజిక సేవా కార్యక్రమాల వైపు దృష్టి పెట్టడం కొత్త కాకపోయినా దీపికా నిర్ణయం వెనుక బలమైన కారణం వుంది .తనలో గూడుకట్టుకున్న వేదన వుంది.ఇప్పుడు ఆమె మానసిక రుగ్మతలపై పోరాటానికి అండగా నిలవడం వెనుక స్వీయ అనుభవం వుంది.

శారీరక ఇబ్బందులు,జబ్బులు గురించి బహిరంగంగా చర్చించే భారతీయ సమాజంలో మానసిక రుగ్మతలకు వచ్చేసరికి పూర్తి భిన్నమైన వాతావరణం వుంది.మానసిక సమస్యల్ని బయటకి చెప్పుకోడానికి ,దానికి అవసరమైన చికిత్స చేయించుకోడానికి మాత్రం వెనకడుగు వేస్తారు.సమాజం తమ మీద పిచ్చి ముద్ర వేస్తుందని భయం.సమాజ పరంగా కొంత ఇబ్బంది వున్న మాట నిజమే అయినా దాన్ని ఎదుర్కోలేక పోతే ,సమస్య నుంచి తప్పుకుంటే అది మన జీవితాన్ని,మన ఆనందాన్నే కబళిస్తుంది.

ఒకప్పుడు డిప్రెషన్ తో దీపికా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.చికిత్స తీసుకోడానికి వెనుకాడారు .ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశారు.అయితే సకాలంలో అది మానసిక సమస్యని గుర్తించి …వైద్యుల సాయంతో దాన్నుంచి బయటపడ్డారు .ఆ గతమే ఇప్పుడు సైకియాట్రిక్ అసోసియేషన్ తో దీపికా కలవడానికి కారణం.ఆమె స్వయంగా ఏర్పాటు చేసిన లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఇప్పటికే మానసిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన పంచుతోంది.ఏమైనా తన కష్టం మరొక్కరికి రాకూడదని దీపికా చేస్తున్న కృషికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే….

SHARE