కర్మ యోగి ఆ ప్రొఫెసర్…

  delhi iit professor alok sagar karmayogi

ఈయన అలోక్ సాగర్…. ప్రొఫెసర్ అలోక్ సాగర్… ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ అలోక్ సాగర్… మొన్నమొన్నటిదాకా ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన రఘురామరాజన్ గురువు… హూస్టన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేసిన ఐఐటీయన్ అలోక్ సాగర్…. మరేంటి ఇలా…?ఓ ఐఐటీ ప్రొఫెసర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? లగ్జరీ లైఫ్ స్టయిల్, వైట్ కాలర్ జాబ్, మెరిసిపోయే కారు, బంగళా, సుఖజీవనం… కానీ ఈయన ఆ జీవనాన్ని వదిలేసి, పేద గిరిజనుల కోసం ఓ ఘర్షణాత్మక జీవనంలోకి అడుగుపెట్టాడు… 1982లోనే రాజీనామా చేశాడు…

మధ్యప్రదేశ్ లోని బేతుల్, హోషంగాబాద్ జిల్లాల్లోని గిరిజనులే తన బంధువులు, తన స్నేహితులు… ఆ ప్రాంతమే తన లోకం… వేల మొక్కలు నాటిస్తాడు, విత్తనాలు పంపిణీ చేయిస్తాడు… మహా అయితే ఆయనకున్న ఆస్తులేమిటో తెలుసా? ఓ డొక్కు సైకిల్, మూడు జతల దుస్తులు… అంతే… నిజంగా అంతే…

వీళ్లను కదా మనం ‘కర్మయోగులు’’ అని పిలవాల్సింది… వీళ్లు కదా జాతికి ఆదర్శప్రాయులుగా గుర్తించబడాలి… వీళ్లు కదా పద్మభూషణులు, పద్మవిభూషణులు, భారతరత్నాలు… వీళ్లు కదా అసలు సిసలు ప్రజాసేవకులు…

గిరిజనుల కోసం ఆ తండా, ఈ తండా నడుమ సైకిల్ పై తిరుగుతుంటే అనేకసార్లు పోలీసులు అనుమానంతో పట్టుకునేవారు, ప్రశ్నించేవారు… ఓ ఉప ఎన్నిక సందర్భంగా ఠాణాకు తీసుకుపోయి విచారించారు… ‘బాబూ, నాయనా… నేను ఫలానా అని చెప్పుకునేవాడు…’ ఇప్పుడంటే అందరికీ తెలిసిపోయాడు కాబట్టి ఆ తనిఖీల బాధలేమీ లేవు… 28 ఏళ్లుగా ఓ ఆదివాసీ ఇంట్లో ఉంటున్నారు ఆయన…ఆ ఇంటికి కనీసం దర్వాజలు కూడా లేవు… అసలు వాటి అవసరమే లేదని నవ్వుతాడు… ఆదివాసీ శ్రామిక సంఘటనతో కలిసి పనిచేయడమే ఆయన లోకం… ఇంకేమీ లేదు… విద్య, విద్యుత్తు, వైద్యం అందని అనేక తండాలే ఆయన కార్యస్థలాలు… ఆ గిరిజనుల భాషలోనే మాట్లాడుతూ, తోచిన సేవలు చేస్తూ బతకడమే ఆయన లక్ష్యం… అదే ఉద్యోగం, అదే జీతం, అదే జీవితం

SHARE