Posted [relativedate]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎంత హాట్ హాట్ గా జరుగుతున్నాయో చూస్తున్నాం.బయట లాబీల్లో కూల్ కూల్ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి.లోపల వేడి కాస్త బయటి సరదా చర్చలతో చల్లబడుతోంది.ఇవాళ అలాంటిదే ఓ విషయం మంత్రి దేవినేని ఉమకి సరదాతో పాటు కాసింత ఇబ్బంది కూడా కలిగించింది.అదేంటో ఓ లుక్ వేద్దామా ..
అసెంబ్లీ లాబీల్లో మంత్రి దేవినేని ఉమకి కొందరు జర్నలిస్ట్ మిత్రులు ఎదురుపడ్డారు.ఆ మాట ఈ మాట అయ్యాక ఓ విలేకరి హైదరాబాద్ అసెంబ్లీ బాగుందా …ఈ తాత్కాలిక అసెంబ్లీ బాగుందా ? అని మంత్రిని అడిగాడు.ఆ ప్రశ్నని తేలిగ్గా తీసుకున్న ఉమా రాజుని చూసిన కళ్ళతో వేరే వాళ్ళని చూడగలమా అని ఎదురు ప్రశ్నించారు.పరోక్షంగా హైదరాబాద్ అసెంబ్లీ బాగుంటుందని చెప్పడంతో పాటు దాన్ని నవాబులు కట్టించిన విషయాన్ని గుర్తు చేశారు.ఎదురుగా వున్న విలేకరులు తేలిగ్గా ఊరుకుంటారా ! నవాబుకు,నారాయణకు పోలిక తెస్తున్నారా అంటూ ఉమాని ఇరుకున పెట్టారు.పరిస్థితి అర్ధమైన ఉమా తేరుకుని “నేను ఆ మాట అనలేదు..అయినా నారాయణ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ బాగా కట్టారు ” అని చెప్పి అక్కడ నుంచి బయటపడ్డారు.ఇదంతా గమనిస్తున్న ఓ టీడీపీ ఎమ్మెల్యే విలేకరులకు,నారదుల వారికి డిఎన్ఏ ఒకటే అయ్యి ఉంటుందని ముక్తాయిస్తూ అక్కడనుంచి కదిలి వెళ్లిపోయారు.