Posted [relativedate]
శశికళ భవిష్యత్తుపై ధర్మరాజు ఆనాడే ఓ అంచనాకు వచ్చాడు. చిన్నమ్మ సీఎం అవుతుందని ఆనాడే చెప్పాడు. ధర్మరాజు అంటే మహాభారతంలోని ధర్మరాజు కాదు. తమిళనాడుకు చెందిన ఓ జ్యోతిష్యుడు. ఈయన మన్నార్గుడి ప్రాంతానికి చెందిన వాడు కావడం గమనార్హం.
జయలలిత నిచ్చెలిగా ఓ శశికళ ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో… ఆమెకు వడుకంపట్టి ధర్మరాజు ఆస్థాన జ్యోతిష్యుడిగా ఉండేవాడు. ఆయన మాటే చిన్నమ్మకు వేదవాక్కు. సిద్ధాంతిగారికి చెప్పకుండా ఏ పనిచేసే కాదు. అప్పట్లో జయకు ఆమె మరింత దగ్గరకు రావడానికి ఈ జ్యోతిష్యుడి సలహాలే కారణమని టాక్. అంతేకాదు జయలలిత సాంగత్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దని ఆమెకు గట్టిగా చెప్పేవాడట. మాటల సందర్భంలో ఓసారి శశికి ముఖ్యమంత్రి యోగం కూడా ఉందని లడ్డూ లాంటి వార్త చెప్పాడట. అయితే అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అప్పట్లోనే సూచించాడని సమాచారం.
అప్పట్లో ఎందుకనో శశికళకు … ధర్మరాజుకు మధ్య చెడిందట. ముఖ్యంగా ధర్మరాజు సూచనలను ఆమె పెడచెవిన పెట్టడంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు. అందుకే అతను చిన్నమ్మకు దూరంగా వెళ్లిపోయాడు. ఇక లాభం లేదనుకొని… శశికళ మన్నార్గుడిలోని ఇతర జ్యోతిష్యులను సంప్రదించింది. సీఎం పదవీయోగంపై ఆరా తీసిందట. అయితే వారు మాత్రం ముఖ్యమంత్రి పదవి యోగం ఉందో.. లేదో తెలీదు కానీ ఉన్నత పదవి ఖాయమని చెప్పారట. దీంతో చిన్నమ్మకు అప్పట్నుంచే ముఖ్యమంత్రి పీఠంపై ఆశ పెరిగిందట.
జ్యోతిష్యులు కూడా ఉన్నత పదవి ఖాయమని చెప్పడంతో.. దాన్ని కైవసం చేసుకునేందుకు శశికళ అప్పట్నుంచే పక్కా వ్యూహంతో ప్రణాళికను అమలు చేసిందట. ఆ వ్యూహాలే ఇప్పుడు సీఎం పీఠం దగ్గరకు ఆమెను చేర్చాయని సమాచారం. అయితే ధర్మరాజు చెప్పిన కొన్ని సూచనలను ఆమె పాటించలేదట. అందుకే ఇప్పుడు సీఎం సీటు విషయంలో చిక్కులొస్తున్నాయని టాక్. ఇప్పుడు చిన్నమ్మకు పాత సిద్ధాంతిగారు గుర్తొస్తున్నారట. ఆయన చెప్పినట్టు వింటే… ఇన్ని సమస్యలు వచ్చేవి కావని తెగ బాధపడిపోతుందట. కొంపదీసి సీఎం సీటు చేజారిపోతుందా అన్న భయం ఆమెను వెంటాడుతోంది. కానీ ఏం లాభం. ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయింది. ఇక చేయడానికేమీ లేదు!!