Posted [relativedate]
కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ కంటే ఎక్కువ స్పీడ్ పెంచిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు పార్టీ పెద్దల అండ ఉందా? పార్టీ పెద్దల అండతోనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై రెడ్డి బ్రదర్స్ విమర్శలు చేస్తున్నారా? పీసీసీ పదవిపై కాంగ్రెస్ పెద్దల నుంచి వారికి స్పష్టమైన హామీ ఉందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను మారుస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రానుందని లీకులు వస్తున్నాయి. దీంతో రెడ్డి బ్రదర్స్ ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు. పీసీసీ మాదేనంటూ సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. అయితే ఈ బ్రదర్స్ కు అంత ధీమా ఎక్కడ్నుంచి వచ్చిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రెడ్డి బ్రదర్స్ కు నల్లగొండ జిల్లాలో గట్టి పట్టుంది. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఉత్తమ్ కంటే ఆర్థికంగా బలమైన నాయకులు. వాయిస్ వినిపించడంలో ఉత్తమ్ కంటే గట్టి వారే. అంతేకాదు ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో చాలామంది ఉత్తమ్ కంటే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికే మద్దతు తెలుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అందులోనూ త్వరలో ఛానల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాకిస్తే తెలంగాణలో పవర్ కాంగ్రెస్ దేనంటూ హైకమాండ్ దగ్గర గట్టిగా వాయిస్ ను వినిపిస్తున్నారు. అన్నీ అనుకూలాంశాలు ఉన్నాయి కాబట్టే హైకమాండ్ పెద్దలు.. కోమటిరెడ్డి బ్రదర్స్ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వీరి కోసం సోనియా గాంధీ దగ్గర గట్టి లాబీయింగ్ చేస్తున్నారన్న ఊహాగానాలు వస్తున్నాయి.
ఉత్తమ్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్ని విమర్శలు చేసినా … వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై ఉత్తమ్ వర్గం గుర్రుగా ఉంది. అయితే ఇతర నాయకులు మాత్రం బ్రదర్స్ కు పదవి ఖాయమైంది కాబట్టి హైకమాండ్ ఈ విమర్శలను లైట్ తీసుకుంటోందని గుసగుసలాడుకుంటున్నారు. ఇటు రెడ్డి సోదరుల దూకుడు చూస్తుంటే… పీసీసీ పదవి వారికి లాంఛనమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పదవి దక్కొచ్చు. అలా ఛాన్స్ కోమటిరెడ్డి సోదరులకే వస్తుందా.. లేక ఉత్తమ్ నే కొనసాగిస్తారా.. చూడాలి!!