Posted [relativedate]
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. ఇప్పటి మిత్రులే రేపటి శత్రువులు. ఇప్పటి శత్రువులే రేపటి మిత్రులు. ఈ సిద్ధాంతాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు తమిళ తంబీలు. జయలలిత బతికున్నంత కాలం విభేదాలతో కాలక్షేపం చేసిన పన్నీర్, పళని వర్గాలు ఇప్పుడు ఐటీ దెబ్బకు ఒక్కటవుతున్నారు. ఆర్కేనగర్ ఉపఎన్నిక తర్వాత జరిగిన ఐటీ దాడుల్లో ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ అరెస్ట్ కావండ వేగంగా జరిగిపోయాయి. కానీ అవినీతి ముద్ర పడ్డ విజయ్ భాస్కర్ ను క్యాబినెట్ నుంచి తొలగించేందుకు పళని సిద్ధమైనా.. దినకరన్ మాత్రం ససేమిరా అంటున్నారు.
దీంతో పళని వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. అవినీతి ఆరోపణలతో సర్కారు ఎక్కువకాలం మనుగడ సాధించలేదని, విజయ్ భాస్కర్ తో పాటు దినకరన్ నూ సాగనంపాలని నిర్ణయించారు. ఇందుకోసం మాజీ సీఎం పన్నీర్ వర్గంతో చర్చలు జరిపారు. చర్చల్లో 90 శాతం సానుకూలత వ్యక్తం కావడంతో.. సీఎం, మాజీ సీఎం కలిసిపోవడం ఖాయమైంది. ఇప్పటికే పన్నీర్ కు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. పళని వెంట 60 మంది వస్తారని భావిస్తున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా బలం కావాలి. కొందరు తటస్థుల్ని తమవైపు తిప్పుకోవాలని నేతలు ఆలోచిస్తున్నారు.
సీఎం పదవి కోసం పన్నీర్ కు హ్యాండిచ్చి శశికళ వర్గంలోనే కొనసాగిన పళనిస్వామి.. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్లీ పన్నీర్ కు చేరువవుతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇద్దరం కలిసి కాపాడుకుందామని, అవసరమైతే శశికళతో యుద్ధానికి సిద్ధమౌదామని అనుకున్నారు. మొదట్నుంచీ చిన్నమ్మ అంటే పడని పన్నీర్.. ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. దీంతో అరవ రాజకీయ ఆసక్తికరమైన మలుపు తిరగనుంది. ఇదిలా ఉంటే వీరి ఎత్తుకు పైఎత్తు వేయడానికి దినకరన్ శశికళను కలుస్తున్నారు.