Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఏ అంశం హాట్ టాపిక్ అవుతుందో.. ఎవరికీ తెలియదు. ఎప్పుడో ద్రావిడ ఉద్యమకాలంలో హిందీ వ్యతిరేకత అంటే నడిచింది కానీ.. ఇప్పుడు కూడా అదే పాత ఫార్ములాను పట్టుకుని వేలాడుతున్నారు డీఎంకే నేత స్టాలిన్. నిజానికి హిందీ వ్యతిరేకతను తమిళ నేతలు రాజకీయాలకు మాత్రమే వాడుకున్నారు. కానీ మరీ లోతుగా ఎప్పుడూ వెళ్లలేదు. కానీ స్టాలిన్ మాత్రం నేషనల్ హైవేలపై హిందీ పేర్లు కొట్టేయడం వివాదాస్పదమైంది.
స్టాలిన్ కు అనుభవం తక్కువ అనే విషయం మరోసారి రుజువైందనే కామెంట్లు పడుతున్నాయి. అసలు తమిళనాడు జనం ఏమనుకుంటున్నారనేది స్టాలిన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమిళనాడులో ఏటా హిందీ నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయంలో చెన్నైలోనే ఉంది. అలాంటిది నేటి తరం ఆలోచనలకు విరుద్ధంగా స్టాలిన్ హిందీ వ్యతిరేక నినాదం అందుకోవడం డీఎంకే కార్యకర్తలకు కూడా రుచించడం లేదు.
కాబట్టి స్టాలిన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఓవైపు బీజేపీ అభివృద్ధి నినాదంతో దూసుకుపోతుంటే.. ఇటు డీఎంకే మాత్రం పాత చింతకాయ పచ్చడి లాంటి అంశాలు పట్టుకోవడం అసలుకే ఎసరు తెస్తోందనేది కార్యకర్తల వాదన. ఇప్పటికే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటోంది. ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకే ఎవరైనా మోడీని కాదని ముందుకెళ్లే పరిస్థితి లేదు. హిందీ వ్యతిరేక ఉద్యమంతో యువతకు కూడా దూరమౌతామేమోనని డీఎంకే క్యాడర్ భయపడుతోంది.