7 లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రుడి పాలు ..

 dowleswar cotton barrage 7 laks kyuseks water mixed sea
రాజమహేంద్రవరం, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం మరింతగా పెరిగింది. నదిలోకి ఇన్‌ఫ్లో తొమ్మిది లక్షల క్యూసెక్కులు ఉండటంతో కాటన్‌ బ్యారేజీకి చెందిన 175 గేట్లను రెండు మీటర్ల ఎత్తుకు లేపి ఏడు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 36 అడుగులు ఉండటంతో ధవళేశ్వరం వద్ద 9.64 అడుగులకు నీటిమట్టాన్ని స్థిరీకరించారు.

భద్రాచలం వద్ద నీటిమట్టం శనివారం 31.09 అడుగులు ఉండగా, ఆదివారం రాత్రికి 38.02 అడుగులకు పెరిగింది. సోమవారం సాయంత్రానికి 36 అడుగులకు తగ్గింది. భద్రాచలం నుంచి వస్తున్న నీటిని వచ్చింది వచ్చినట్లు సముద్రంలోకి విడుదల చేస్తున్నప్పటికీ పుష్కర ఘాట్ల వద్ద ప్రవాహం పెరిగి, యాత్రికుల స్నానాలకు ఆటంకం కలుగుతోంది.

సోమవారం దుమ్ముగూడెం, పోలవరం వద్ద 10 అడుగులు, పేరూరు, కొయిదా వద్ద 11 అడుగులు, కుంట వద్ద 13 అడుగులు, కూనవరం వద్ద 17 అడుగులు, రాజమహేంద్రవరం హేవలాక్‌ బ్రిడ్జి వద్ద 18 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టా కాల్వలకు 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పశ్చిమ డెల్టా కాల్వలకు 5,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 4 వేల క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొత్తూరు కాజ్‌వేపై మూడు అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహించడంతో ఎగువన ఉన్న 19 మన్యం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కొవ్వూరులో రెండు పుష్కర స్నానఘట్టాలను మూసివేశారు.

SHARE