టీడీపీ తోక అచ్చిరాదులే …కాంగ్రెస్ పేరు ఖుషీలే

Posted December 23, 2016

election commission canceled andhra pradesh election party list
ఓ సక్సెస్ ఫుల్ సినిమా వస్తే అలాంటి పేరే పెట్టడం …అలాంటి కధలే తీయడం చిత్రసీమలో ఎంత సాధారణమో…ఓ రాజకీయ పార్టీ నుంచి బయటికి వచ్చినోళ్ళు దాన్ని పోలిన పేరుతో కొత్త కుంపటి పెట్టుకోవడం కూడా అంతే .జగన్ నేతృత్వంలో నడుస్తున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు తాజా ఉదాహరణ.ఇదొక్కటే కాకుండా కాంగ్రెస్ తోక తగిలించుకున్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ విజయాలే సాధించాయి.బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ వైభవం చూస్తూనే వున్నాం.ఆ పార్టీ దెబ్బకి కమ్యూనిస్ట్ కంచుకోట కకావికలమైంది. ఇక తమిళనాట ఒకప్పుడు తమిళ మానిల కాంగ్రెస్ కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది.కాంగ్రెస్ ని ఢీకొట్టి తమిళనాట మంచి ఫలితాలతో పాటు కేంద్ర క్యాబినెట్ లోను స్థానం సంపాదించింది.కేరళలో కురువృద్ధుడు కరుణాకరన్ పెట్టిన డెమోక్రాటిక్ ఇందిరా కాంగ్రెస్ సొంతంగా గెలవలేకపోయినా కాంగ్రెస్ ని బాగానే చికాకు పెట్టింది.

ఇక కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళ విషయం ఇలా ఉంటే టీడీపీ తో వైరం పెట్టుకుని బయటపడ్డ వాళ్లలో ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి,అయన కుమారుడు హరికృష్ణ స్థాపించిన పార్టీలు ఏ మాత్రం సక్సెస్ కాలేదు.ఇక ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన నాదెండ్ల భాస్కర రావు పెట్టిన ప్రజాస్వామ్య తెలుగుదేశం మట్టికొట్టుకు పోయింది.ఈ ముగ్గురు పెట్టిన పార్టీ పేరులోతెలుగు దేశం ఉండేలా చూసుకున్నా రిజల్ట్ రివర్స్ అయ్యింది.హరికృష్ణ స్థాపించిన అన్నా తెలుగుదేశం,లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 255 రాజకీయ పార్టీలని రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.2005 నుంచి 2015 మధ్య కాలంలో ఏ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ పార్టీల గుర్తింపుని ఈసీ రద్దు చేసింది.ఎన్నికల సంఘం రద్దు చేసిన వాటిలో తెలుగు రాష్ట్రాలకి చెందిన 12 పార్టీలు వున్నాయి.వాటి వివరాలు ఇవే ..

1. ఆల్ ఇండియా సద్గుణ పార్టీ

2. ఆంధ్రనాడు పార్టీ

3. అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ)

4. బహుజన రిపబ్లికన్ పార్టీ

5. భారతీయ సేవాదళ్

6. జై తెలంగాణ పార్టీ

7. ముదిరాజ్ రాష్ట్రీయ సమితి

8. నేషనల్ సిటిజన్స్ పార్టీ

9. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి)

10. సత్యయుగ్ పార్టీ

11. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

12. తెలంగాణ ప్రజా పార్టీ

SHARE