తండ్రీకొడుకుల సవాల్ ..సమాజ్ వాది లో చిచ్చు..

0
446

 father son war samajwadi party uttar pradesh
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార సమాజ్ వాది పార్టీలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.బాబాయ్ ,అబ్బాయి ల మధ్య మొదలైన పోరు ..తండ్రీకొడుకుల సవాల్ గా మారింది. దేశ రాజకీయాలకి గుండెకాయలాంటి యూపీ లో తాజా పరిణామాలు అనూహ్యమే.కొడుకుల కోసం ఏదైనా చేసే తండ్రుల్ని రాజకీయాల్లో ఎందరినో చూశాం.ఇక సన్ స్ట్రోక్ దెబ్బకి కుదేలైన వాళ్ళని కూడా చూశాం. అయితే ఆధునిక రాజకీయంలో యూపీ పరిణామాలు సరికొత్త కథ..

ఉత్తరప్రదేశ్ లోశాంతిభద్రతల పరిస్థితి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఒకరు రాజీనామా చేస్తానని ప్రకటించారు .అయన పేరు శివపాల్ యాదవ్ .స్వయానా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి బాబాయ్..సమాజ్ వాది అధినేత ములాయం కి సోదరుడు.దీంతో ఒక్కసారిగా యూపీ లో రాజకీయ కాక పెరిగింది .శివపాల్ యాదవ్ ప్రకటన కి ములాయం స్పందన తో అగ్గికి ఆజ్యం తోడయినట్టయింది.పెద్దాయన రంగంలోకి దిగితే పరిస్థితి చక్కదిద్దుతారని అంతా అనుకున్నారు.కానీ ములాయం నోట ఎవరూ ఊహించని మాటలు వచ్చాయి.శివపాల్ రాజీనామాతో సమాజ్ వాది లో చీలిక ప్రమాదం పొంచివుందని …అదే జరిగితే తాను తమ్ముడితోనే ఉంటానని ములాయం వ్యాఖ్యానించారు.

తండ్రి కామెంట్స్ తో ముఖ్యమంత్రి అఖిలేష్ అయోమయంలో పడ్డారు.ఎదురు మాట్లాడదామంటే తండ్రి,బాబాయ్ లకి వ్యతిరేకంగా మాట్లాడాలి.అసలు ఈ పరిస్థితికి శాంతిభద్రతల సమస్య ఒక్కటే కారణం కాదు .ముందునుంచి బాబాయ్..అబ్బాయ్ ల మధ్య అంతరం వుంది.తండ్రి ములాయం కూడా అఖిలేష్ వ్యవహారశైలిపై అసంతృప్తిగా వున్నారు.గతంలో కూడా శాంతిభద్రతల పరిస్థితిపై బహిరంగంగానే మాట్లాడారు.ఇప్పుడు తమ్ముడి వైపే మొగ్గుచూపారు.

ఎన్నికల సంవత్సరంలో ఈ పరిణామం సమాజ్ వాది కి ఇబ్బందే ..కానీ దీనిపైనా విమర్శలు వస్తున్నాయి.శాంతిభద్రతల వైఫల్యాన్ని కప్పిపుచ్చి సమస్యను పక్కదారి పట్టించడానికే ములాయం కుటుంబం ఈ నాటకానికి తెర లేపిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.మరో వాదన కూడా వినిపిస్తోంది.కొడుకుతో గొడవపడుతున్న తమ్ముడిని శాంతింపజేసి వ్యవహారం ముదరకుండా ములాయం జాగ్రత్తపడుతున్నారని ఓ వర్గం ఆలోచన.మొత్తానికి తండ్రీకొడుకుల సవాల్ టీ కప్పులో తుపాన్ అవుతుందో ..లేక రాజకీయ సునామీగా మారుతుందో చూడాలి ..

Leave a Reply