పుష్కరాల కోసం వస్తున్న కొత్త నీరు

  fresh water pushkaraalu

కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానాలకు స్వచ్ఛమైన నీరు తరలివస్తోంది. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వస్తోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు అక్కడి నుంచి పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల ప్రారంభమైంది. సాగర్ వద్ద విడుదల చేసిన కృష్ణా జలాలు సత్రశాల, దైద ఘాట్లను తాకుతూ పులిచింతల వైపు వస్తున్నాయి. ఇప్పటికే పులిచింతలలో నిల్వ ఉన్న నీటిని విడుదల చేసి ప్రకాశం బ్యారేజీలో నిల్వ చేస్తున్నారు. పులిచింతల నుంచి 9485 క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా 1.4 టీఎంసీల నీరు పులిచింతలలో ఉంది.

పులిచింతలకు సాగర్ నీరు చేరితే ప్రవాహం మరింత కొనసాగుతుంది. కృష్ణానదికి జలకళ సంతరించుకోవడంతో పుణ్యస్నానాలకు వచ్చే వారికి స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రానుంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కృష్ణా డెల్టాకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. 7500 క్యూసెక్కుల చొప్పున 16వ తేదీ వరకు నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 12944 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. 1,79,422 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 863.6 అడుగులకు చేరుకుని 117.49 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నుంచి విడుదల చేస్తున్న నీరు పల్నాడులోని సత్రశాల, దైద ఘాట్లను తాకుతూ పులిచింతల వైపు పయనిస్తోంది. పల్నాడులో ఘాట్ల నిర్మాణం పూర్తికావడంతో యాత్రికుల హడావుడి మొదలైంది.  యాత్రికుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై విధులు నిర్వహించే ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే స్నానఘాట్ల వారీగా బాధ్యతలు తీసుకున్న జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ రద్దీకి అనుగుణంగా పలు మార్పులు చేసుకుంటూ పుష్కర క్రతువుకు సిద్ధమవుతున్నారు

SHARE