కృష్ణా పుష్కరాలు అమరావతి చరిత్రలో తొలి ఘట్టంగా మిగిలాయి. రాజావాసిరెడ్డి కాలం నుంచి ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో జనం పోటెత్తారు. పుర వీధులు జన ప్రభంజనంగా మారాయి. కృష్ణా పుష్కరాల పదకొండో కావడంతో, మరో రోజు మాత్రమే పుష్కర స్నానం చేసేందుకు అవకాశం ఉండటంతో జనం పోటెత్తారు. ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్ వద్ద భక్తులు కృష్ణమ్మ ఒడిలో పవిత్ర స్నానం ఆచరించారు.
అమరేశ్వర ఆలయం చుట్టూ, గుంటూరు రోడ్డు, క్రోసూరు రోడ్డు, విజయవాడ రోడ్డు, ధరణికోట రోడ్డు, పెదకూరపాడు రోడ్లలో జన సంద్రంగా మారాయి. గుంటూరు రోడ్డులో నరుకుళ్లపాడు వరకు రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. క్రోసూరు రోడ్డులో ధరణికోట చివరి వరకు, విజయవాడ రోడ్డులో వైకుంఠపురం వరకు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. అమరావతి చరిత్రలో ఇంత మంది రావడం ఇదే మొట్టమొదటి సారిగా చరిత్రకు ఎక్కింది. అమరావతి పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బంది సమన్వయంగా పని చేసి ఘాట్స్‌లో రద్దీ లేకుండా చేశారు.
అందరినీ ఒకేఘాట్ వైపు స్నానాల కోసం మళ్ళిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు ధ్యానబుద్ద ఎదురుగా ఏర్పాటు చేసిన క్యూ నుంచి నుంచి విడతల వారీగా యాత్రికులనుఘాట్స్లోకి తరలిస్తున్నారు తొలుత ఏ ఘాట్స్‌లో పూర్తిస్థాయిలో యాత్రికులు చేరగానే అక్కడికి వెళ్ళేవారిని బిఘాట్స్ వైపు అక్కడ కూడా నిండిపోతే ధ్యానాంజనేయస్వామి వద్ద ఉన్న సి ఘాట్స్‌కు తరలిస్తున్నారు. ఘాట్స్ వద్ద ఉన్న బృందాలు యాత్రికులు ఎక్కువ సేపు నదిలో ఉండకుండా చూశాయి. ఒక్కో యాత్రికుడు సగటున ఐదు నిమిషాలు పాటు స్నానం ఆచరించి బయటకు వచ్చేలా సిబ్బంది ప్రయత్నాలు ఫలించాయి.పుష్కర మేళాజనం.. జనం.. ప్రభంజనం .. ఘాట్లలో ఇసుకేస్తే రాలనట్లుగా… కుంభ మేళాను తలపించేటట్లుగా ఆదివారం భక్తజనం పోటెత్తింది. జిల్లాలోని ఘాట్లు వేకువజామున నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కిక్కిరిసిపోయాయి. అమరావతి వీధులు జనసంద్రాన్ని తలపించాయి. ఎండ తీవ్రతతో పుష్కర భక్తులు అవస్థలు పడ్డారు.