Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజాయుద్ధనౌక గద్దర్ మొన్నటి వరకు బండెనకి బండి కట్టి నిజాంని ఎదిరించమని పాటలు పాడారు. కానీ ఇప్పుడు పదహారు బళ్లు కట్టి మరీ జనసేన లోకి వెళతానంటున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వ అవార్డులే తనకు పెద్ద లెక్క కాదన్న గద్దర్ ఉన్నట్లుండి పవన్ పై ఎందుకు మోజు పడుతున్నారో.. ఆయన శిష్యులకు కూడా అర్థం కావడం లేదు. అసలు జనసేనకి క్యాడరే లేదు. అలాంటిది తెలంగాణలో జనసేన పార్టీకి చీఫ్ గా ఉంటానంటూ గద్దర్ ఎలా ప్రపోజల్ పంపించారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
ముందు పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియనా.. కాదా అనే విషయంలోనే క్లారిటీ లేదు. అలాంటితి తాను దూర సందులేదు.. మెడకో డోలు అన్నట్లు.. పవన్ కే రాజకీయాలపై క్లారిటీ లేనప్పుడు గద్దర్ ను ఎలా చేర్చుకుంటారని మరికొందరు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ గద్దర్, పవన్ అనుబంధం ఈనాటిది కాదు. పవన్ స్టార్ హీరో కాకముందు నుంచే గద్దర్ కు వీరాభిమాని, గద్దర్ అన్నా, ఆయన పాట అన్నా చెవి కోసుకుంటారు. గతంలో ఏరికోరి చాలాసార్లు గద్దర్ ఇంటికి వెళ్లి మరీ ఆయన పాటలకు కాంప్లిమెంట్స్ ఇచ్చివచ్చారు పవన్.
కానీ తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లుగా ఇప్పుడు పవన్ ప్రవర్తిస్తున్నారని గద్దర్ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. ఇటీవలే పవన్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని నోరుజారిన గద్దర్.. తర్వాత తీరిగ్గా నాలుక్కరుచుకున్నారు. అసలు పవన్ ఏమైనా చేస్తారని ఏపీలో ఏమైనా అంచనాలున్నాయేమో కానీ.. తెలంగాణలో మాత్రం అసలు లేదు. అలాంటిది గద్దర్ ఎందుకు వెళ్లాలనుకున్నారు.. పవన్ ఎందుకు వద్దనుకున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరిస్తే కానీ అసలు సీక్రెట్ రివీల్ అయ్యే ఛాన్స్ లేదు.