Posted [relativedate]
ప్రజాయుద్ధనౌకగా పేరున్న గద్దర్ కు.. ఉన్నట్టుండి రాజకీయాలపై మోజు పుట్టినట్లైంది. తన శిష్యులందరికీ మంచి పదవులిచ్చిన కేసీఆర్.. తనను మాత్రం తొక్కేశారని గద్దర్ లోలోపల మథనపడుతున్నారు. గద్దర్ మాత్రమే కాదు ఆయన సమకాలీకులందరికీ కేసీఆర్ పదవులు ఇవ్వలేదు. పైగా వీరి కళ్లముందు పాటలు నేర్చుకున్న చోటా మోటీ నేతలందర్నీ మంచి మంచి పదవులతో అందలం ఎక్కించారు. ఉద్యమ సమయంలో గద్దరన్నా అంటూ ఆప్యాయత పంచిన కేసీఆర్.. ఆ తర్వాత మాత్రం కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నది లోగుట్టు.
ఆ అసంతృప్తితోనే గద్దర్ ఇటీవలే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుచేశారు. అంబేద్కర్ సిద్ధాంతంతో ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల బాగు కోసం తెలంగాణ తెచ్చుకుంటే.. కొన్ని వర్గాలే మేలు పొందుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ సమాజంలో 3 శాతం ఉన్న కులాలు.. 97 శాతం ఉన్న ఇతర కులాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కూడా పాలన తీరు ఏమీ మారలేదని, ఉమ్మడి రాష్ట్రం మాదిరిగానే గొంతెత్తే వారిపై అణచివేత సాగుతోందన్నారు గద్దరన్న.
ఇటీవలే ఓయూలో జరిగిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభలో పాల్గొన్న గద్దర్.. ఓట్లు మావే.. పాలన మాదే అన్న నినాదంతో దళితులు ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ దమననీతిని ఎదిరించాలన్నారు. మొదట మావోయిస్టులతో కలిసి పనిచేసిన గద్దర్.. తర్వాత జనంలో తిరిగారు. ఇప్పుడు కొత్తగా అంబేద్కరిజం అంటున్నారు. ఇంతకూ గద్దరన్నకు అసంతృప్తి ఎందుకు..? ఆయన ఏ పదవి కోరుకుంటున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.