దశ తిరిగిన గన్నవరం ..

 gannavaram niyojakavargam andhra pradeshగత పుష్కరాల నాటికి గన్నవరం నియోజకవర్గం. గన్నవరం, ఉంగుటూరు మండలాలు పూర్తిగా, బాపులపాడు మండలంలో సగం గ్రామాల కలయికతో ఉండేది. పునర్విభజన నేపథ్యంలో ఈ పుష్కరాల నాటికి నియోజకవర్గ పరిధి బాగా పెరిగింది. గన్నవరం, ఉంగుటూరు మండలాలతో పాటు బాపులపాడు మండలం పూర్తిగా, విజయవాడ గ్రామీణ మండలంలో తొమ్మిది పంచాయతీలు కలిసి 2.30 లక్షల ఓటర్లతో పెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా అవతరించింది.

రాజధాని అమరావతికి ప్రభుత్వ శాఖలన్నీ తరలిరావాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో పలు కార్యాలయాలు నియోజకవర్గంలోనే కొలువు దీరాయి. కేసరపల్లిలో రైతు సాధికార సంస్థ, ప్రసాదంపాడులో ఎకై ్సజ్, ఎనికేపాడులో గృహనిర్మాణ శాఖల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కస్టమ్స్, ఎకై ్సజ్ శాశ్వత కార్యాలయం గన్నవరం సమీప ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. విజయవాడ మెట్రో కారిడార్ నిడమానూరు వరకు ప్రతిపాదించారు. మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్కు, పారిశ్రామిక హబ్, రాజధాని బాహ్యవలయ రహదారి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లేలా నమూనా రూపొందించడం, రామవరప్పాడు రైవస్ కాల్వపై వంతెన నిర్మాణానికి నిధుల మంజూరు వంటివి ఈ పుష్కరాల ముందు శుభ సూచకాలుగా నిలిచాయి.

అమరావతి నూతన రాజధానిగా ఎంపికవడంతో విమానాశ్రయం నుంచి రహదారుల సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గన్నవరం శివారు నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారి మొత్తం నందనవనంగా తయారైంది. పుష్కరాలకు వస్తున్న యాత్రికులు సంభ్ర మాశ్చర్యాలకు గురవుతున్నారు. డివెడర్ల మధ్యలోని విద్యుద్దీపాలు నియోజకవర్గానికి కొత్తవెలుగు తీసుకువచ్చాయి నియోజకవర్గంలోనే ప్రధాన రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందిన నూజివీడు (హనుమాన్‌జంక్షన్) స్టేషన్‌లో విశాఖ, హైదరాబాద్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని గత పుష్కరానికంటే ముందు నుంచే స్థాని కులు విన్నవిస్తూ వచ్చారు. ఈపుష్కరాల నాటికి ఈ కల సాకారమైంది.

విశాఖ వెళ్లే రత్నాచల్, హైదరాబాద్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ లభించింది. గత పుష్కరాల కంటే ముందు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. స్వర్ణ చతుర్భుజి కింద అప్పట్లో బీజేపీ ప్రభుత్వం దీనిని విస్తరించడంతో ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఈ పుష్కరాలకు ఆరు వరుసలుగా విస్తరించే ప్రక్రియ చేపట్టారు. యాధృచ్ఛికంగా ఇప్పుడు కూడా కేంద్రంలో భాజపానే అధికారంలో ఉండటం విశేషం. అలాగే బ్రహ్మయ్యలింగం చెరువుని జలాశయంగా అభివృద్ధి చేయాలనేది గత పుష్కరాల సమయంలో ప్రతిపాదించారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు అంకురార్పణ జరిగింది. జలాశయంగా అభివృద్ధి చేయడంతో పాటు దీనిని హుస్సేన్‌సాగర్ తరహాలో పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు సీఎం కార్యాచరణ చేపట్టారు. పనులు జరుగుతున్నాయి.

గత పుష్కరాల తర్వాత రూపుదిద్దుకున్న గన్నవరం ఐటీ పార్కు మాత్రం ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ప్రభుత్వం 30 ఎకరాల భూమి కేటాయించగా, ఎల్అండ్‌టీ సంస్థ అయిదు అంతస్తుల అధునాతన భవనం నిర్మించింది. ఆశించిన మేర ఇక్కడ ఐటీ సంస్థలు కొలువుదీరకపోవడం గుర్తింపు నామమాత్రమైంది. ఇటీవల తాత్కాలిక సచివాలయం ఏర్పాటుకు ఈ భవనాన్ని ఎంపిక చేసి, డీనోటిఫై చేయమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం కూడా అమరావతిలోనే నిర్మించాలని నిశ్చయించడంతో నిరాశే మిగిలింది.

SHARE