Posted [relativedate]
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్: చిరంతన్ భట్
ఆర్ట్: భూపేష్ భూపతి
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్ర
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
దర్శకత్వం: జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్)
నిడివి: 2 గంటల 12 నిమిషాలు
విడుదల తేది : 12 జనవరి, 2016
అఖండ భారతవనిని ఏకం చేసి అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలన అందించిన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి.. ఈ కథనే తన వందో మూవీగా చేసుకుని నటించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ..ఇక గమ్యం – వేదం – కృష్ణంవందే జగద్గురుం – కంచె సినిమాలతో విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ దర్శకత్వం వహించిన చారిత్రాత్మక చిత్రం ఇది. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.. మరి ఈ అంచనాలను బాలయ్య, క్రిష్ అందుకున్నారా అంటే ఈ రివ్వూ చదవాల్సిందే.
కథ:
అమరావతిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న శాతవాహన సామ్రాజ్య యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి (యువరత్న బాలకృష్ణ) అఖండ భారతావనిని ఒకేతాటి మీదకు తేవాలనుకుంటాడు. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు ఆ తర్వాత వరుసగా 29 యుద్ధాలు చేసి ఆ రాజ్యాలను జయించి…వారిని తన సామంతులుగా చేసుకుంటాడు. ఈ క్రమంలోనే దక్షిణభారతదేశంలో పెద్ద రాజు అయిన సౌరాష్ట్ర నహపాలుడిని ఓడించి భారత్‌ను ఏకం చేయాలనుకుంటాడు. ఈ భారీ యుద్ధంలో శాతకర్ణి నహపాలుడిని ఓడించి అతడి అల్లుడు అయిన వృషభనాథుడిని అక్కడ తన సామంతుడిగా చేసుకుంటాడు. భారతేశాన్ని గతంలో పాలించిన ఎందరో గొప్ప రాజులు అయిన అశోకుడు, చంద్రగుప్తుడు చేయలేని పనిని శాతకర్ణి చేస్తాడు. ఇక అఖండభారతాన్ని చేజిక్కుంచుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. ఈ విష ప్రయోగం నుంచి శాతకర్ణి బయటపడతాడ.. గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్ ను శాతకర్ణి ఓడించాడా.. తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
శాతకర్ణి ముందుగా భారత్‌ను ఏకం చేసి, తర్వాత గ్రీకులను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాన్ని ఈ మూవీలో ప్రస్తావించాడు క్రిష్. మూవీ ప్రారంభమే కళ్యాణ్‌దుర్గం మీద యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మరో గట్టి రాజ్యమైన సౌరాష్ట్ర మీద దండెత్తడంతో రెండో యుద్ధం చేసి, ఇండియాను ఏకం చేస్తాడు. చివర్లో గ్రీకుల యుద్ధం జరుగుతుంది. భారత్ ఏకమవ్వడంతో పాటు మన దేశానికి విదేశీ రాజ్యాల నుంచి ముప్పు తప్పుతుంది. ఇదే కథను తాను ఎలా అయితే అనుకున్నాడో తెరమీద అంతకుమించి ప్రజెంట్ చేశాడు. శాతకర్ణి రాజుగా అతడి ప్రస్థానం ఎలా ప్రారంభమైంది అన్న దానికంటే కేవలం క్రిష్ దేశాన్ని అతడు ఏకం చేసే అంశంమీదే ఎక్కువుగా కాన్సంట్రేషన్ చేశాడు. అతడి వ్యక్తిగత జీవితంలో తల్లికి-అతడికి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా తక్కువుగా రాసుకున్నాడు. ఇక భార్యకు అతడికి మధ్య వచ్చే సన్నివేశాలు తక్కువే అయినా అవి నీట్‌గా ఉన్నాయి. బాలయ్య-శ్రేయ మధ్య ప్రేమ, యుద్దం వంటి చక్కగా చూపారు. రాజసుయ యాగం చేసినప్పుడు బాలయ్యమహిళల గురించి చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. యుద్ధభూమికి బాలయ్య తన కుమారుడిని కూడా తీసుకెళ్లి చేసే సాహసం కూడా బాగుంది. అక్కడ బాలయ్య కొడుకు పులోమావి నహపాలుడి కళ్లల్లోకి ఎలాంటి భయం లేకుండా చూసే సీన్ చాలా హైలెట్.
నటినటుల పని తీరు
శాతకర్ణి సినిమాలో బాలయ్య నటన చూస్తే బాలయ్యలో ఎనర్జీ రోజు రోజుకు పెరుగుతందనిపించింది. శాతకర్ణిగా అతడి నటన తన తండ్రి ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలను గుర్తు చేసింది. బాలయ్య యుద్ధ సన్నివేశాల్లోను, డైలాగులు చెప్పడంలోను, ఇలాంటి సినిమాలు చేయడంలోను మరోసారి తనకు తిరుగులేదు అనిపించుకున్నాడు. .ఇప్పుడు ఈ వయస్సులో కూడా అదే ఎనర్జీ..ఇంకా చెప్పాలంటే అంతకుమించిన ఎనర్జీతో యుద్ధ సన్నివేశాల్లో నటించాడు. ఇక బాలయ్య భార్య వశిష్టి దేవిగా శ్రేయ, బాలయ్యకు తల్లిగా మహారాణి గౌతమిగా బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని నటన మూవీకి ప్లస్ పాయింట్. యుద్ధం ధర్మ అనే ధీటైన పాత్రలో హేమమాలిని నటిస్తే, యద్ధం వద్దు భర్త శ్రేయస్సే ముఖ్యం అనుకునే రోల్లో శ్రేయ నటించింది. ఇక ఇద్దరు పిల్లలకు తల్లిగా, అటు మహారాజు భార్యగా శ్రేయ ఆ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. ఇక కబీర్ బేడి, శివకృష్ణ, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం
ఈ సినిమాకు ప్రాణం సినిమా ఫోటో గ్రఫి, ఆర్ట్, మ్యూజిక్, ఎడిటింగ్.. ఒక చారిత్ర మూవీని కేవలం 2 గంటల 12 నిమిషాల్లో చూపడం అసాధ్యం..కాని క్రిష్ తన టెక్నికల్ టీమ్ ను ఉపయోగించుకుని అసాధ్యాన్ని సుసాథ్యం చేశాడు. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గురించి ఎంత చెప్పుకున్నా…ఏమని చెప్పుకున్నా తక్కువే…నటీనటులను అందంగా, సీన్‌కు తగ్గట్టుగా క్లోజప్, లాంగ్ షార్ట్‌లలో చూపించడంలోను, యుద్ధ సన్నివేశాలు, సాంగ్స్ తెరమీద అందంగా చూపడంలో ప్రతిభ కనబరిచాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ భూపతి అందించిన కళ మూవీలో మాత్రమే చూడాలి. శాతవాహన సామ్రాజ్యం, కళలు, శిల్పాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి సినిమాలో అన్ని సీన్లలోను ఓ వైపు సీన్లను చూస్తూనే మరోవైపు ఆర్ట్ వర్క్‌ను సైతం మిస్ కాకూడదనేంత అద్భుతంగా ఉంది. సాంగ్స్, సీన్లు, శాతకర్ణి జీవిత చరిత్రను వివరిస్తూ శివరాజ్‌కుమార్ చేసే సాంగ్‌లో అడుగడుగునా శాతవాహన కళా వైభోగాన్ని కళ్లకు కంటినట్లు ఆవిష్కరించాడు భూపతి. ఇక గుండెకాయలాంటి మ్యూజిక్ తో చిరంతన్ భట్ మెస్మరైజ్ చేశాడు. పాటలతో పాటు ఆర్ ఆర్ ప్రతీసీన్ను ఎలివేట్ చేసింది. పాటల కంటే సీన్లు, వార్ సన్నివేశాల్లో ఆర్ ఆర్ అదిరిపోయింది. శాతకర్ణి మూవీ అంటేనే యుద్దాలు.. ఆ యుద్ద సన్నివేశాలను తీర్చిదిద్దింది రామ్ లక్ష్మణ్ లు.
ఈ మూవీలో తొలి యుద్దం – నహపాలుడు యుద్ధం-గ్రీకుల యుద్ధం అన్నీ సినిమాకు ఎక్కడికో తీసుకెళ్లాయి. నహపాలుడుతో సముద్రంలో చేసే యుద్ధం, నహపాలుడు కోటలోకి ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య చేసిన విన్యాసం, చివర్లో గ్రీకులతో బ్లూ మ్యాట్ మీద చేసిన భారీ యుద్ధం ఇలా ఈ యుద్ధాన్ని తీసుకున్నా మైండ్ బ్లోయింగ్ చేసేశాయి. కత్తి కంటే బలంగా డైలాగ్స్ అందించిన ఘనత బుర్రా సాయి మాధవ్.. యుద్దాన్ని ఎలా కలకాలం జ్ఞపకం ఉచుకుంటామో.. ఈ మూవీలో డైలాగ్స్ ని అదే విధంగా గుర్తుండిపోతాయి. ప్రజలు పొట్లాడు కోవడం లేదు.. ప్రభువులే పదవుల కోసం యుద్దాలు చేస్తున్నారు, మనం కథలు చెప్ప కూడదు…మన కథలు జనం చెప్పుకోవాలి., శరణం అంటే రక్ష…రణం అంటే మరణశిక్ష ఏదీ కావాలి… బడుగు జాతి కాదు..తెలుగు జాతి.., ‘నువ్వు కడుపున మోస్తున్నది బిడ్డని కాదు ఓ మారణహోమాన్ని అనే డైలాగ్స్ ఈ మూవీలో కొన్ని మాత్రమే. మిగిలిన విభాగాల్లో ఎడిటింగ్ కూడా సినిమాలో ఏ సీన్ కట్ చేయడానికి, తీసిపడేయానికి వీలులేనంత క్రిస్పీగా ఉంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదంటే ఎడిటింగ్ గ్రిప్పింగ్ అర్థమవుతోంది. దర్శకుడు క్రిష్ ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఇప్పటి వరకు క్రిష్ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు…శాతకర్ణి మరో ఎత్తు. ఈ సినిమా గతంలో తీసిన చారిత్రక సినిమాల సరసన తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. శాతవాహన చక్రవర్తి తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో దానిని సుత్తి లేకుండా, సూటిగా అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. కథ, హైలెవల్ టేకింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని తన ప్రత్యేక ముద్ర వేశాడు..హాట్సాప్ క్రిష్..ఇక ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మాణ విలువలు ఎక్స్లెంట్. ప్రతి ఫ్రేములోను వారు పెట్టిన భారీ ఖర్చు కనపడింది. ఇక చివరిగా శాతకర్ణి అంటే చక్రవర్తి అని తెలుసు.. అతడు తెలుగు వాడని తెలుసు.. అయితే అతని చరిత్ర కనీసం చరిత్ర పాఠల్లో కేవలం పేరాలుగానే ఉంది.. క్రిష్ తన మూవీ ద్వారా ఒక చారిత్రక మహా గ్రంధాన్నే అందించాడు.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది..ఇక మన తెలుగోడి కథ.. ఇప్పుడు దీనిని విశ్వ వ్యాప్తం చేసిన ఘనత మాత్రం నందమూరి బాలకృష్ణ, క్రిష్ లదే.. బాహుబలి మూవీని, శాతకర్ణి మూవీని త్రాసులో వేచి తూస్తే మొగ్గు శాతకర్ణి వైపే ఉంటుంది.. ఈ మూవీ గురించి ఇంతకంటే చెప్పలేం.
కామెంట్ః తెలుగు సీనీ మీసం తిప్పిన శాతకర్ణి
రేటింగ్ః 4/5