Posted [relativedate]
తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగా మారాయి. జయ మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతా సెట్ అయిపోయిందని అనుకున్న తరుణంలో… వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు ఎగరవేశారు. దీంతో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. ఈపరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే అడుగులేస్తోంది.
డీఎంకే నేత స్టాలిన్… అన్నాడీఎంకేలోని పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రస్తుతం సెల్వం సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఆయనకు కావలసినంత మెజార్టీ లేదు. అయినప్పటికీ డీఎంకే మద్దతిస్తే సెల్వం ముఖ్యమంత్రి అవుతారు. డీఎంకే సపోర్ట్ తో సెల్వం సీఎం అయితే ఫ్యూచర్ లో అది డీఎంకేకు బాగా అడ్వాంటేజ్ ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి .. ప్రభుత్వం కూలిపోకుండా తాము కాపాడామని చెప్పుకోవచ్చు. ఇది డీఎంకేకు బాగా కలిసివచ్చే అంశమే. పైగా ఫ్యూచర్ లో సెల్వం కూడా డీఎంకే పట్ల సానుకూలంగా ఉంటారు. ఇది సానుకూల అంశమే.
అటు ఒకవేళ సెల్వంకు డీఎంకే మద్దతివ్వకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. రాజ్యాంగ సంక్షోభం వచ్చేస్తుంది. అలా అయితే అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోతుంది. ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. అది కూడా డీఎంకేకు ప్లస్ అవుతుంది.
ఇలా డీఎంకే ఈ స్టాండ్ తీసుకున్నా… కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ఏ స్టాండ్ తో ఎక్కువ లాభం జరుగుతుందో స్టాలిన్ ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. సెల్వంకు మద్దతు పలికేందుకే స్టాలిన్ మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఈ పరిణామాలతో డీఎంకే కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక డీఎంకేకు బంగారు భవిష్యత్తు ఉంటుందని సంతోషంగా ఉన్నారట.