గ్యాంగ్‌స్టర్ నయీం కేసును ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేయనుంది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు సహా ఎనిమిది మంది బృందంతో నయీం కేసు విచారణ చేపట్టనుంది. నయీమ్ పై నమోదైన పలు కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో దర్యాప్తు చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాద ముందని భావించిన డీజీపీ అనురాగ్ శర్మ సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేసు తీవ్రత దృష్ట్యా కుడా విచారణను సిట్‌కు అప్పగించినట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. నయీం డైరీల్లోని విషయాల్ని సిట్ నిగ్గు తేల్చనుంది.
మరోవైపు నయీమ్, అతని అనుచరుల నివాసాల్లో జరుగుతున్న సోదాల్లో రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారు నగలు, వజ్రాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. లెక్కకు మించి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వందలాది ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగు చూస్తున్నాయి. నయీం అరాచాకాలను బయటకు తీసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా పోలీసులు బుధవారం ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వనస్థలిపురం ద్వారకామయినగర్ లో నయిం అనుచరుడు ఖయ్యుమ్ నివాసాన్ని పోలీసులు గుర్తించారు. ఖయ్యుమ్ ఇంట్లో కీలక పత్రాలు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నయీం అనుచరులు పరారయ్యారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అతడిని నల్లగొండ తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.
అక్రమ దందాల్లో నయీం కూడబెట్టిన ఆస్తి రూ.2,500 కోట్ల దాకా ఉంటుందని పోలీసుల అంచనా. సిట్ బృందం ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కుడా విచారణ కొనసాగిస్తుంది. నయీం వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తులతో జాబితా రూపొందించి వాటి వివరాల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ద్వారా కోర్టు అనుమతితో ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది.