అసెంబ్లీ కి వస్తున్న GST బిల్లు…

 gst bill coming  assembly 2 days

పార్లమెంట్ ఆమోదించిన వస్తు, సేవల పన్ను బిల్లు మరో ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 8న జీఎస్టీకి లోక్ సభ ఆమోదం తెలిపింది. అంతకుముందే 3న రాజ్యసభ జీఎస్టీని ఆమోదించింది. జీఎస్టీ కి TRS మద్ధతు కూడా తెలిపింది. పార్లమెంట్ లో ఆ పార్టీ ఎంపీలంతా జీఎస్టీ కి ఓటేశారు. పార్లమెంట్ ఆమోదం తెలిపిన 30 రోజుల్లోగా దేశంలోని కనీసం 16 రాష్ట్రాల అసెంబ్లీలు జీఎస్టీ ని ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు పెట్టేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

అసెంబ్లీ సమావేశాలను ఈనెలాఖరులో ప్రారంభించి సెప్టెంబరు 10 కల్లా ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సెషన్స్ కోసం సెప్టెంబర్ 30దాకా గడువు ఉంది. అయితే జీఎస్టీ బిల్లు అధికారికంగా రాష్ట్రానికి ఒకట్రెండు రోజుల్లోనే రానుంది. బిల్లు రాష్ట్రానికి చేరిన వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

సెప్టెంబర్ 5 నుంచి 15వరకు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ టైమ్ లో అసెంబ్లీ పెడితే అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ముందుగానే అసెంబ్లీ పెట్టాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. జీఎస్టీ ని ఆమోదించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని మంత్రులు, అధికారులతో కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు కేసీఆర్. ఈ మీటింగ్ లోనే జీఎస్టీ బిల్లు, అసెంబ్లీ నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే చాన్సుంది.

SHARE