వర్షాలకు గుంటూరు జిల్లాలో ఏడుగురి మృతి

guntur rain death

భారీ వర్షాలు గుంటూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఉప్పొంగిన వరద నీరు ఏడుగురిని బలిగొంది. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కుప్పగంజి వాగులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గంగన్నపాలెంకి చెందిన చేవూరి ఏడుకొండలు (40), అతడి భార్య సుబ్బాయమ్మ (35), కుమార్తె వనజ (10), కుమారుడు వెంకటేశ్వర్లు (18)లు ఎత్తిపోతల పథకం భవనం వద్ద కాపలా ఉంటూ అక్కడే నివసిస్తున్నారు. వరద నీరు ఒక్కసారిగా రావడంతో భవనం మునిగిపోయింది. దీంతో భవనంలో ఉన్న వారంతా వరదనీటిలో కొట్టుకుపోయారు. వీరిలో వెంకటేశ్వర్లు సమీపంలో ఉన్న తాటిచెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. వెంకటేశ్వర్లును చూసిన సమీప బంధువు పోలయ్య అతన్ని కాపాడేందుకు వెళ్లి చిక్కుకుపోయాడు. దాదాపు 6 గంటలపాటు అక్కడే ఉన్న వారిని స్థానికులు రక్షించారు.

సత్తెనపల్లి మండలం గోరంట్ల వద్ద ఎద్దువాగులో నందిగం అబ్రహం అనే వ్యక్తి కొట్టుకు పోయి మృతి చెందాడు. సత్తెనపల్లి పట్టణంలోని వాల్మీకినగర్‌ లో ఇంటి గేటు వద్ద నిలబడి ఉన్న ఎద్దులదొడ్డి వెంకటగణేష్‌ ఆదిత్య(20 నెలలు) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బాలుడు కాల్వలో పడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు చిన్నారిని రక్షించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందాడు. పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి వద్ద చెరువులో పడి అదే గ్రామానికి చెందిన గోసి సింగరయ్య (40) చనిపోయాడు. నకరికల్లులో బాలింత చింతకాయల జమ్మక్క (21) పిడుగుపాటు శబ్దానికి భయపడి చనిపోయింది. మొత్తం ఏడుగురు చనిపోగా ఒకరు గల్లంతయ్యారు. కాగా విశాఖ జిల్లాలో ముగ్గురు గల్లంతయ్యారు.

SHARE