గుత్తాకు మొండిచేయి?

 Posted March 23, 2017

gutha sukhender reddy with empty handsమినిస్ట‌ర్ కావాల‌న్న న‌ల్గొండ‌ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి క‌ల తీరే అవ‌కాశాల్లేవా? మ‌ంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఆయ‌న‌కు ఛాన్స్ లేన‌ట్టేనా? అంటే ఔన‌నే అంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.

తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 2014లో ఎంపీగా గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా ఛాన్స్ వ‌చ్చింది. అలా తాను కూడా ఎంపీగా ఉన్నప్పటికీ.. కేసీఆర్ కేబినెట్ లోకి వస్తానని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. కానీ ఆ ఆశలన్నీ అడియాలయ్యాయని ఇప్పుడు ఆయ‌న‌ మథనపడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆయనకు మినిస్ట్రీ రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీఆర్ఎస్ లోకి రాకముందు గుత్తా సుఖేందర్ రెడ్డి .. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఒకదశలో ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటూ కేసులు కూడా వేసే దాకా వెళ్లారు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా దూకుడు తగ్గించారు. ఏం జరిగిందో కానీ ఒక్కసారిగా టీఆర్ఎస్ కు జై కొట్టారు.

మినిస్ట్రీ కోసమే ఆయన కేసీఆర్ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఆ మేర‌కు కేసీఆర్ నుంచి కూడా ఆయ‌నకు పాజిటివ్ సిగ్న‌ల్స్ వ‌చ్చాయ‌ట‌. గ‌తేడాది ద‌స‌రాకే మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వస్థీక‌ర‌ణ ఉంటుంద‌ని వార్త‌లొచ్చాయి. కానీ అది పెండింగ్ లో ప‌డింది. ఇప్పుడు మ‌రోసారి ఆ చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ రేసులో మాత్రం గుత్తా పేరు వినిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం.

టీఆర్ఎస్ శ్రేణుల వాద‌న మాత్రం మ‌రోలా ఉంది. ఆయ‌న‌కు మంత్రిప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటే ముందు న‌ల్గొండ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాలి. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలి. అప్పుడు గానీ గుత్తా మంత్రి అయ్యే ఛాన్స్ లేదు. ఇక న‌ల్గొండ ఎంపీ ప‌దవికి రాజీనామా చేస్తే ఆయ‌న స్థానంలో టీఆర్ఎస్ త‌ర‌పున ఇంకొక‌రిని నిల‌బెట్టాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత త‌రుణంలో ఆ సీటు గెల‌వ‌డం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ కు చెందిన రాజ‌కీయ ఉద్దండులు ఉత్త‌మ్, జానా, కోమ‌టిరెడ్డి సోద‌రులను త‌ట్టుకొని గెల‌వడం క‌ష్ట‌మే. కాబ‌ట్టి టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం ఉప ఎన్నిక‌ల‌ను కోరుకోవ‌డం లేదు. ఈ కార‌ణాల నేప‌థ్యంలో సుఖేంద‌ర్ రెడ్డిని మంత్రివ‌ర్గం లోకి తీసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రి మినిస్ట్రీ క‌ల నెర‌వేర‌క‌పోతే… గుత్తా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది!!!

SHARE